ప్రభుత్వ వైఫల్యాలపై ‘రచ్చబండ’

15 Jul, 2020 05:46 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న కోదండరాం. చిత్రంలో గోవర్ధన్, చాడ, సంపత్‌కుమార్, ఎల్‌.రమణ

అఖిలపక్ష పార్టీల నిర్ణయం  

బలమైన కార్యాచరణకు త్వరలో రూపకల్పన  

‘భవంతులు కాదు బతుకులు కావాలి’అనే నినాదంతో పోరుబాట  

ఎల్‌.రమణ నివాసంలో జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడానికి నడుం బిగించాయి. ప్రతిపక్షాల నిర్బంధం, కరోనా నియంత్రణ చర్యల్లో సర్కారు నిర్లక్ష్యం వంటి అంశాలపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లాలని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి. ‘రచ్చబండ’పేరిట ప్రజల్లోకి వెళ్లి అన్ని విషయాలు వివరించాలని మంగళవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ నివాసంలో జరిగిన భేటీలో నిర్ణయించాయి. సమావేశానికి టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐఎంఎల్‌ (న్యూడెమోక్రసీ) నేత గోవర్ధన్‌ హాజరయ్యారు. కరోనా నియంత్రణ, కార్మికులను ఆదుకునే విషయంలో ప్రభుత్వవైఖరి, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం, ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన విరాళాలు, ప్రతిపక్షపార్టీలపై ప్రభుత్వ నిర్బంధం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. 

కోవిడ్‌ కోరల్లో పేదలు: కోదండరాం 
టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై బలమైన కార్యాచరణకు రూపకల్పన చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. సచివాలయం కూల్చివేతకు నిరసనగా గన్‌పార్కు వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పేదలు కోవిడ్‌ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకునే నాథుడేలేరని విచారం వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులు, చేతివృత్తిదారులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల వారి పక్షాన ఉద్యమించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వవైఫల్యాలపై ’రచ్చబండ’కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ మాట్లాడుతూ కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రులు, వివిధ జిల్లా ఆసుపత్రుల్లో సరైన వసతులు లేవని, తెలంగాణలో భవంతులు కాదు, బతుకులు కావాలన్న నినాదంతో పోరాటం చేస్తామని తెలిపారు. 

కొత్త భవనాలు అవసరంలేదు: రమణ 
ఎల్‌.రమణ మాట్లాడుతూ కరోనాతో ప్రజల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొత్త భవనాలు అవసరం లేదని అన్నారు. ప్రగతిభవన్‌ ఉద్యోగులకు కరోనా వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారని, మరి ఇల్లు లేని పేదలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నిరసన తెలిపే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై వర్చువల్‌ ర్యాలీలు , రచ్చబండ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని చెప్పారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా