ప్రచార హోరు

23 Mar, 2019 01:22 IST|Sakshi
శుక్రవారం నామినేషన్‌ వేయడానికి వెళ్లే ముందు అత్తమామల ఆశీర్వాదం తీసుకుంటున్న కవిత 

అభ్యర్థుల ఖరారుతో ఊపందుకున్న ప్రచారం

ప్రచారాస్త్రాలతో పార్టీలు సిద్ధం.. శుక్రవారం ఒక్కరోజే 70 నామినేషన్లు 

ఖమ్మం అభ్యర్థిగా రేణుకా చౌదరిని ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం

నేడో, రేపో మిగిలిన ఏడు స్థానాలకు బీజేపీ జాబితా

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల ఖరారు దాదాపుగా పూర్తవడంతో.. రాష్ట్ర రాజకీయాల్లో అసలు సిసలు ఘట్టానికి తెరలేవనుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ 10 స్థానాల్లో పోటీదారుల పేర్లను వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల సందడి ఊపందుకుంది. నామినేషన్ల దాఖలుకు కేవలం ఒక్కరోజు (25వ తేదీ) మాత్రమే మిగిలి ఉండటంతో.. నేతలంతా క్షేత్రస్థాయి బాటపట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి తరఫున ముఖ్యనేతలు, గ్రామ, మండల, జిల్లాస్థాయి నాయకులు ప్రచార పర్వంలోకి దూకనున్నారు. క్షేత్రస్థాయి ప్రచారం కోసం ఇప్పటికే ప్రచార రథాలు, సామగ్రి సిద్ధం కాగా, ఓట్లు రాల్చే ప్రచారాస్త్రాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని పార్టీలు రెడీ అయ్యాయి.

గులాబీ దండు ఖరారు 
అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 17మంది అభ్యర్థులను గురువారం రాత్రి సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందులో ఐదుగురు రెడ్డి, ఇద్దరు వెలమ వర్గం నాయకులుండగా.. కమ్మ, మున్నూరుకాపు, యాదవ, గౌడ్, లింగాయత్‌ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు. ఇక, రిజర్వుడు నియోజకవర్గాల్లో ఒకటి లంబాడా, మరోటి గోండు, రెండు మాదిగ, ఒకటి నేతకాని సామాజిక వర్గాలకు ఇచ్చారు. మొత్తంమీద 8 మంది ఓసీలు, నలుగురు బీసీలు, ముగ్గురు ఎస్సీ, ఇద్దరు ఎస్టీలకు అవకాశం కల్పించారు. ఈసారి జాబితాలో ఏడుగురు సిట్టింగ్‌లకు మాత్రమే చాన్స్‌ దక్కగా, 10 కొత్త ముఖాలు అధికార పార్టీ తరఫున రంగంలోకి దిగాయి. 
 
ఖమ్మం ఒక్కటి మినహా 
కాంగ్రెస్‌ పార్టీ కూడా రెండు విడతల్లో 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం బరిలో ఎవరుంటారనే విషయంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. అనూహ్య రాజకీయ పరిణామాలు జరుగుతాయనే ఆలోచనతోనే ఈ స్థానానికి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదనే చర్చ ఉన్నా.. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిని ఇక్కడి నుంచి పోటీ చేయించడం దాదాపు ఖాయమైనట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం కొంత పోటీ ఉన్నప్పటికీ చివరి నిమిషంలో రేణుక వైపే అధిష్టానం మొగ్గు చూపడంతో ఏ క్షణంలోనైనా ఆమె పేరును ప్రకటిస్తారని టీపీసీసీ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా పోరు రసవత్తరంగా సాగనుంది. 
 
గాలానికి పడతారేమో! 
బీజేపీ తొలిజాబితాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించినా ఏడు స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చే వలస నేతలకు ఇప్పటికే గాలం వేసిన బీజేపీ తమ గాలానికి ఎవరయినా చిక్కుతారేమో అనే ఆలోచనతో ఆ స్థానాలను పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పెద్దపల్లి నుంచి జి.వివేకానంద, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చేవెళ్లకు ఏపీ జితేందర్‌రెడ్డి, మెదక్‌ బరిలో సునీతా లక్ష్మారెడ్డి తదితరుల నిర్ణయం కోసం ఆ పార్టీ ఎదురుచూస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుగుతున్నాయని, ఎలాగూ రానున్న రెండు రోజులు నామినేషన్ల దాఖలు అవకాశం లేనందున అన్నీ తేలిన తర్వాతే మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని, ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా జాబితా వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఆదిలాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ నుంచి వచ్చిన సోయం బాపూరావును బరిలోదించారు. ఆయన శుక్రవారం నామినేషన్‌ వేశారు. 
 
నిస్తేజం నుంచి! 
నామినేషన్ల దాఖలు కార్యక్రమం శుక్రవారం ఊపందుకుంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, తొలి మూడు రోజుల్లో 60 నామినేషన్లు కూడా దాఖలు కాలేదు. అందులో ప్రధాన పార్టీల నుంచి దాఖలయింది మూడు, నాలుగు మాత్రమే. 21న హోలీ కారణంగా నామినేషన్లు స్వీకరించలేదు. దీంతో నిస్తేజం నుంచి కోలుకుని శుక్రవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే 70కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల్లో.. టీఆర్‌ఎస్‌ నుంచి నిజామాబాద్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత, సికింద్రాబాద్‌ అభ్యర్థి తలసాని సాయికిరణ్, మల్కాజ్‌గిరి నుంచి మర్రిరాజశేఖర్‌రెడ్డి తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ స్థానానికి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి స్థానానికి, చేవెళ్లకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి స్థానానికి రేవంత్‌రెడ్డి శుక్రవారమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఆయా స్థానాల్లో రాజకీయ సందడి షురూ అయింది. ఇక, 23, 24 తేదీల్లో సెలవుల కారణంగా.. చివరిరోజైన 25వ తేదీ సోమవారం మరింత మంది నామినేషన్లు వేయనున్నారు. 
 
గ్రామాల్లో సందడి 
అభ్యర్థుల ఖరారు పూర్తయి, నామినేషన్ల దాఖలు ప్రక్రియకు కేవలం ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచార రథాలు, సామాగ్రి నియోజకవర్గాలకు చేరిపోయాయి. సభలు, సమావేశాలతో ఛోటా–మోటా నాయకులు నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించినా, ఇక నుంచి ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు గ్రామాలకు వెళ్లనున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. క్షేత్రస్థాయి ప్రచారంతో అగ్రస్థాయి నేతల బహిరంగసభలకు కూడా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పక్షాన సీఎం కేసీఆర్‌ ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్‌లలో బహిరంగసభలు పూర్తి చేసుకోగా, మిగిలిన చోట్ల ఆయన పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ తరఫున ప్రచారం కోసం రాహుల్, ప్రియాంకల సభలపై కసరత్తు జరుగుతోంది. బీజేపీ తరఫున ప్రధాని మోదీతో పాటు ఆ పార్టీ చీఫ్‌ అమిత్‌షా, ఇతర కేంద్రమంత్రులు ప్రచారానికి రానున్నారు. వామపక్షాలు కూడా జాతీయ స్థాయి అగ్రనేతలతో ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మొత్తంమీద దాదాపు పార్లమెంటు పోరు ఓ కొలిక్కి వస్తుండడంతో ఇక నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారభేరి మోగనుంది.  

మరిన్ని వార్తలు