పార్టీల దృష్టిలో మేం బిచ్చగాళ్లం!

3 Apr, 2019 17:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లోని రైతులు గత జనవరి నెలలో తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. రుణాలు తీసుకొని చెల్లించని రైతులపై 12 జిల్లాల్లోని బ్యాంకులు కేసులు పెట్టడం పట్ల వారు రగిలిపోయారు. ఆ రుణాలను రద్దు చేయడంతోపాటు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. కూరగాయలు, పండ్లు సహా పలు పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం కూడా వారి డిమాండ్లలో ఒకటి. అదే సమయంలో చక్కెర మిల్లుల నుంచి తమకు రావాల్సిన 396 కోట్ల రూపాయలను విడుదల చేయించాలని డిమాండ్‌ చేస్తూ చెరకు రైతులు సమ్మెకు దిగారు. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా చలి కాలంలో అకాల వర్షాలు పడడంతో ఆలుగడ్డ పంట పూర్తిగా ధ్వంసమైంది. అంతకుముందు మూడేళ్ల అకాల పరిస్థితుల వల్ల కూడా ఆలు పంట దిగుబడి బాగా దెబ్బతింది.

పంట దిగుబడులు తగ్గి పోవడం, వాటికి కూడా మార్కెట్‌లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడం తదితర కారణాల వల్ల రాష్ట్ర వ్యవసాయం పూర్తిగా కుదేలయిపోయింది. అప్పులు చెల్లించలేక వేధింపులకు గురై రైతులు ఆత్మహత్యలను ఆశ్రయించడం ఎక్కువైంది. రైతుల రుణాలను పూర్తిగా  మాఫీ చేస్తామని చెప్పిన రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తన మాటను నిలుపుకోవడంలో విఫలమవడం, పంటలపై పెట్టుబడికి కనీసం ఒకటిన్నర రెట్లు కనీస మద్ధతు ధర ఉండేలా చూస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట నిలుపుకోకపోవడంతో రైతుల దుస్థితి దారణమైంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల పట్ల పంజాబ్‌ రైతులు పూర్తి నిర్లిప్తతను వ్యక్తం చేస్తున్నారు.

‘అన్ని పార్టీల వారికి మేము బిచ్చగాళ్ళుగా కనిపిస్తున్నాం. ఎన్నికలు రాగానే మాకు ఉచితంగా కరెంట్‌ ఇస్తామంటారు, రుణాలు రద్దు చేస్తామని చెబుతారు. మాకవన్నీ అక్కర్లేదు. మా పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు. మిగతావన్నీ మేమే భరించగలం’ అని భారతి కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు అజ్మీర్‌ సింగ్‌ రజేవల్‌ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలకు ఆయా పార్టీలు కట్టుబడి ఉండేలా చట్టం తీసుకరావాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన ఏకైక రాష్ట్రం పంజాబే. అందుకు కారణం రైతులే. కేజ్రివాల్‌ నాయకత్వంలోని ఆప్‌ పార్టీ ఏకంగా నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అందులో మూడు నియోజకవర్గాల్లో రైతుల ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎక్కువగా ఉండడం గమనార్హం.

ఈ ఐదేళ్ల కాలంలో అంతర్గత కలహాల కారణంగా ఆప్‌ ప్రతిష్ట దెబ్బతిన్నది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శిరోమణి అకాలీదళ్‌ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రైతులందరి అన్ని రుణాలు మాఫీ చేస్తాననే హామీ ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు లక్షల రుణాలను మాత్రమే మాఫీ చేయడం, అది వ్యవసాయ భూమి కలిగిన రైతులకు మాత్రమే పరిమితం చేయడం వల్ల రైతులు మండి పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్‌ రైతులు సహజంగా కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేయాలి. అయితే ఏ పార్టీ పట్ల తమకు నమ్మకం లేదు కనుక ఏ పార్టీకి ఓటేయాలనే ఉత్సాహం లేదని వారంటున్నారు.

మరిన్ని వార్తలు