ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల

27 Aug, 2018 04:17 IST|Sakshi
అఖిలపక్ష సమావేశంలో సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్, ఎల్‌.రమణ, కె.లక్ష్మణ్, చాడ వెంకటరెడ్డి, కోదండరాం, జీవన్‌ రెడ్డి తదితరులు(కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తున్న కె.రఘు)

కాళేశ్వరం రీ ఇంజనీరింగ్‌ పెద్ద తప్పిదం

టీ జేఏసీ చైర్మన్‌ కె.రఘు ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చరిత్రలోనే అతి పెద్ద ఇంజనీరింగ్‌ తప్పిదమని, తప్పు డు పునాదులపై దీన్ని నిర్మిస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కె.రఘు ఆరోపించారు. ఇది ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల పథకమని విమర్శించారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పేర్కొన్న నీటి లభ్యత గణాంకాలను తప్పుగా అన్వయించుకుని ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారన్నారు. మేడిగడ్డ వద్ద 415 టీఎంసీల లభ్యత ఉందని డీపీఆర్‌లో పేర్కొనడం తప్పని, నీటి లభ్యతను లెక్కించడంలో ప్రాణహిత, మధ్య గోదావరి, మానేరు నదుల నుంచి వచ్చే నీటిని పరిగణనలోకి తీసుకోవడం భారీ తప్పిదమన్నారు. మధ్య గోదావరి నుంచి వచ్చే నీరంతా ఎల్లంపల్లిని దాటి వచ్చే నీరేనని, ఆ నీటిని ఎల్లంపల్లి బ్యారేజీ వద్ద నుంచే పంపింగ్‌ చేసుకోవచ్చని చెప్పారు. మానేరు నుంచి గోదావరిలోకి చేరే నీటిని మధ్య మానేరు రిజర్వాయర్‌ వద్దనే ఎత్తిపోసుకోవచ్చన్నారు. ప్రాణహిత నది గోదావరిలో కలసే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత కేవలం 182 టీఎంసీలు మాత్రమేనన్నారు. ‘కాళేశ్వరం రీ ఇంజనీరింగ్‌–ఇంజనీరింగ్‌ భారీ తప్పిదం’అనే అంశంపై ఆదివారం ఆయన అఖిలపక్షాల నేతలు, రిటైర్డు ఇంజనీర్ల సమక్షంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రీ ఇంజనీరింగ్‌ పేరిట ఎక్కువ ఎత్తు నుంచి కిందికి ప్రవహించే నీటిని తిరిగి అదే ప్రాంతానికి ఎత్తిపోసే తప్పుడు అవగాహనతో ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన చేశారన్నారు. మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంతో ప్రయోజనాలేవీ ఉండవని, వేల కోట్ల అదనపు పెట్టుబడి వ్యయం, విద్యుత్, ఇతర నిర్వహణ వ్యయాన్ని వృథా చేయాల్సి ఉంటుందన్నారు.

చిన్న మార్పులతో ఎల్లంపల్లికి తరలించొచ్చు
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, 152 మీటర్ల ఎత్తులో అక్కడ బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు సమస్య ఉంటుందని, మేడిగడ్డ వద్ద ఏకంగా 415 టీఎంసీల లభ్యత ఉందనే తప్పుడు కారణాలు చూపి ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చిందని రఘు ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీలను ఎత్తిపోయలేమని సీడబ్ల్యూసీ ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం మేరకు 148 మీటర్ల బ్యారేజీ నుంచి పూర్తి స్థాయిలో నీటిని ఎల్లంపల్లికి తరలించవచ్చని చెప్పారు. కాలువ వెడల్పు, లోతు, పంపుల సామర్థ్యం లాంటి చిన్న చిన్న మార్పులతో మొత్తం 160 టీఎంసీలను తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి తరలించడం సాధ్యమేనని రఘు తెలిపారు.

మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్లే: శ్యాంప్రసాద్‌రెడ్డి
తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్లే ప్రాజెక్టును మేడిగడ్డకు ప్రభుత్వం తరలించిందని రిటైర్డ్‌ ఇంజనీర్‌ శ్యాంప్రసాద్‌రెడ్డి సమర్థించారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని పునరుద్ఘాటించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్‌ అధినేత కోదండరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కాంగ్రెస్‌ నేతలు జీవన్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, నాగం జనార్దన్‌రెడ్డి, అద్దంకి దయాకర్, టీడీపీ నేత ఎల్‌.రమణ, సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.  
 

మరిన్ని వార్తలు