పూర్వాంచలే కీలకం

25 Jan, 2020 05:05 IST|Sakshi

త్రిముఖ పోటీ నెలకొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల దృష్టి పూర్వాంచల్‌ (ఢిల్లీ తూర్పు ప్రాంతం) ఓట్లపైనే పడింది. అక్కడ వలస వచ్చిన ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 30 శాతానికి పైగా ఈ ప్రాంతంలోనే ఉన్నారు. దీంతో వారి ఓట్లను ఆకర్షించడానికి అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. దశాబ్దాల తరబడి ఈ వలసదారులు తూర్పు ఢిల్లీ ప్రాంతంలోని అనధికార కాలనీల్లో నివసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ తమకు సంప్రదాయంగా మద్దతు ఇస్తున్న పంజాబీ, వైశ్య ఓటర్లపైనే ఆధారపడుతూ వీరిని నిర్లక్ష్యమే చేసింది.

అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ అత్యధికంగా పూర్వాంచల్‌ వర్గానికే టిక్కెట్లు ఇచ్చి వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టింది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో 12 మంది ఎమ్మెల్యేలు పూర్వాంచల్‌కు చెందినవారే కావడం విశేషం. కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో మంత్రి గోపాల్‌ రాయ్, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్, దిలీప్‌ పాండే, సోమ్‌నాథ్‌ భారతి వంటి వారు ఆప్‌లో ఉంటూ చక్రం తిప్పుతున్న ప్రధాన నాయకులు. ఈ పరిణామంతో ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కూడా పూర్వాంచల్‌ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి.  

బీజేపీ వ్యూహమేంటి ?
ఢిల్లీ రాష్ట్ర పగ్గాలు మనోజ్‌ తివారీ చేతికి వచ్చాక పార్టీ వ్యూహాల్లో మార్పులు వచ్చాయి. ఆయన ఎక్కువగా పూర్వాంచల్‌ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. నితీశ్‌కుమార్‌కు చెందిన జనతా దళ్‌ (యునైటెడ్‌), రాం విలాస్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీతో పొత్తు కుదుర్చుకున్న కమలనాథులు వలసదారులకు 10 టిక్కెట్లు ఇచ్చారు. వీరిలో పూర్వాంచల్‌కు చెందిన ఎనిమిది మంది, ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ప్రాంతవాసులు ఉంటున్న అనధికార కాలనీలన్నింటినీ కేంద్రం రెగ్యులరైజ్‌ చేసింది. అంతేకాదు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ఉంటే జరిగే ప్రయోజనంపైనే విస్తృతంగా ప్రచారం చేస్తోంది.  

కమలనాథుల బాటలోనే కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇంచుమించుగా బీజేపీ బాటలోనే నడుస్తూ పూర్వాంచల్‌తో పాటు ముస్లిం, మైనార్టీ ఓట్లను కూడా దక్కించుకునేలా ప్రణాళికలు రచించింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ వలసదారులతో పాటు ముస్లింలకు కూడా సీట్లు ఇచ్చింది. బిహార్‌ వలసదారుల ఓట్లను సంపాదించుకోవడానికి ఆర్‌జేడీ నాలుగు స్థానాలు కేటాయించింది. మాజీ క్రికెటర్, బిహార్‌కు చెందిన కీర్తి ఆజాద్‌ కాంగ్రెస్‌లో పూర్వాంచల్‌ ఫేస్‌గా మారారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల ప్రచార బాధ్యతల్ని తానే నిర్వహిస్తున్నారు.  

వలస ఓట్లను కాపాడుకునే ప్రయత్నాల్లో కేజ్రీవాల్‌
గత ఎన్నికల్లో వలసదారుల ఓట్లన్నీ గంపగుత్తగా పొందిన ఆప్‌ ఈసారి ఆ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. వలసదారులు ఉండే కాలనీలకు సబ్సిడీ ధరలకే విద్యుత్‌ అందిస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే నీళ్లు, కరెంట్‌ వంటివన్నీ తక్కువ ధరకే అందిస్తామన్న హామీతో గ్యారంటీ కార్డులు కూడా జారీ చేస్తోంది. ఈసారి కూడా అక్కడ 12 మందికి టిక్కెట్లు ఇచ్చింది. ఎన్నికల వేళ ఢిల్లీలో 300 ప్రాంతాల్లో అపాన్‌ పేరిట పూర్వాంచల్‌ ఫెస్టివల్‌ నిర్వహించింది. ఉత్తర బిహార్‌లో అత్యధికంగా మాట్లాడే మైథిలి భాషను ఢిల్లీ స్కూళ్లలో ఆప్షనల్‌గా ప్రవేశ పెట్టింది. పూర్వాంచల్‌ వాసుల చాత్‌ పండుగ కోసం యుమునా తీరం వెంట వెయ్యికి పైగా ఘాట్లను నిర్మించింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా