పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

20 May, 2019 10:38 IST|Sakshi

ప్రతి రౌండు పూర్తయిన వెంటనే  ఏజెంట్లతో సంతకాలు తీసుకోవాలి

రౌండ్ల వారీగా ఫలితాలను న్యూ సువిధ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి

కౌంటింగ్‌ సిబ్బందికి కలెక్టర్‌ సూచనలు 

సాక్షి, కర్నూలు:  ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు.  ఓట్ల లెక్కింపుపై సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కర్నూలు పార్లమెంటుకు చెందిన వారికి పుల్లయ్య ఇంజినీరింగ్‌ కాలేజీలో, నంద్యాల పార్లమెంటుకు చెందిన వారికి జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపుపై మాస్టర్‌ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు ఈ నెల 23వ తేదీ తమకు కేటాయించిన  కేంద్రాలకు ఉదయం ఐదు గంటలకే చేరుకోవాలని సూచించారు. ఏ టేబుల్‌కు ఎవ్వరనేది అక్కడ ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయిస్తామన్నారు.

స్ట్రాంగ్‌ రూముల నుంచి తెచ్చిన కంట్రోల్‌ యూనిట్ల సీల్‌ను పరిశీలించి.. కేటాయించిన టేబుల్‌పై ఉంచాలన్నారు. కంట్రోల్‌ యూనిట్‌లో ఉండే రిజల్ట్‌ బటన్‌ నొక్కితే అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లు డిస్‌ప్లే అవుతాయన్నారు. టోటల్‌ బటన్‌ ప్రెస్‌ చేసి 17సీతో సరిపోయిందా.. లేదా అని 17ఏతో సరిచూసుకోవాలన్నారు. ఒకవేళ రిజల్ట్‌ బటన్‌ నొక్కితే ఇన్‌వ్యాలిడ్‌ అని వస్తే పోలింగ్‌ ముగిసిన తర్వాత క్లోజ్డ్‌ బటన్‌ నొక్కిండరని అర్థమని, ఇటువంటి వాటిని వెంటనే ఆర్‌వో దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఆర్వో, పరిశీలకుడు కలసి తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రతి రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే అభ్యర్థుల ఏజెంట్లతో సంతకాలు తీసుకోవాలని సూచించారు. రౌండ్ల వారీగా ఫలితాలను న్యూ సువిధ యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాతనే ప్రకటించాలన్నారు. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు వచ్చిన వివిధ సందేహాలను కలెక్టర్‌ నివృత్తి చేశారు. కర్నూలు పార్లమెంట్‌ పరిశీలకుడు కేఆర్‌ మజుందార్, ఏఆర్‌వో ప్రశాంతి,డీఆర్‌వో వెంకటేశం, ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు