ప్రాంతీయ పార్టీల ఐక్యతారాగం

21 May, 2018 03:07 IST|Sakshi

కానీ కాంగ్రెస్‌ కాస్త తగ్గాల్సిందేనని సంకేతాలు

న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్‌ కలిసి బీజేపీకి అధికారం దక్కకుండా చేయడంలో విజయవంతం కావటం.. దేశవ్యాప్త రాజకీయాలను మార్చేదిశగా వెళ్తున్నాయి. ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీని ఎదుర్కొనేందుకు ఏకతాటిపైకి రావాలనే ప్రయత్నాల్లో ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ.. రెండోస్థానంలో ఉండేందుకు అంగీకరించటాన్ని ప్రశంసిస్తున్నాయి. కర్ణాటకలో జేడీఎస్‌ కోసం సీఎం సీటు వదులుకోవటం చూస్తుంటే.. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతను కాంగ్రెస్‌ అర్థం చేసుకుందని స్పష్టమవుతోందని పలువురు ప్రాంతీయ పార్టీల అధినేతలు అభిప్రాయపడ్డారు. యడ్యూరప్ప రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే.. కాంగ్రెస్‌ నేతలకు వివిధ రాజకీయ పార్టీల అధినేతలనుంచి అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. కర్ణాటకలో కూటమి విజయం సాధించిందంటూ జేడీఎస్‌ చీఫ్‌ హెచ్‌డీ దేవెగౌడను రాహుల్‌ ప్రశంసించారు. జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలన్న కాంగ్రెస్‌ నిర్ణయాన్ని ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ప్రశంసించారు. ‘కాంగ్రెస్‌ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది’ అని ఆయన పేర్కొన్నారు. సెక్యులర్‌ పార్టీల ఏకీకరణకు ఇదే సరైన సమయమని డీఎంకే నేత స్టాలిన్‌ వెల్లడించారు.

మమత ‘ప్రాంతీయ కూటమి’ వెనక..
అయితే ఇది ప్రాంతీయ కూటమి విజయమని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యం గెలిచింది.  ఇది ప్రాంతీయ కూటమి ఘన విజయం’ అని ఆమె పేర్కొన్నారు. తన అభినందన సందేశంలో ఆమె రాహుల్‌ గాంధీ పేరును పేర్కొనలేదు. మమత సందేశాన్ని లోతుగా విశ్లేషిస్తే.. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటుకానున్న కూటమికి కాంగ్రెస్‌ నేతృత్వం వహించకూడదని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు కోరుకుంటున్నారనేది స్పష్టమవుతోంది. పలువురు విపక్ష నేతలు కూడా బీజేపీ, ఆరెస్సెస్‌లను ఓడించేందుకు 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ మరింత ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరముందంటున్నారు. కన్నడ ఎన్నికల ప్రచారంలో ప్రాంతీయ పార్టీల నేతలను చికాకు పరచేలా ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తే.. నేనే ప్రధాన మంత్రి అభ్యర్థిని’అని రాహుల్‌ పేర్కొన్నారు. అయితే ముందు అందరం ఏకమై బీజేపీని ఓడించాలని తర్వాతే ప్రధాని ఎవరన్నది నిర్ణయిద్దామని సీపీఐ నేత రాజా పేర్కొన్నారు. అయితే కర్ణాటక ఫలితాల తర్వాత ప్రాంతీయ పార్టీలను సంతోషంగా ఉంచాలనే విషయాన్ని కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది. తన ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీని ఎదుర్కొనేందుకు మరిన్ని త్యాగాలు చేయక తప్పదు.

కాంగ్రెస్‌కు నష్టమేనా!
కర్ణాటకలో తక్కువ సీట్లు గెలిచిన జేడీఎస్‌కు కాంగ్రెస్‌ సీఎం సీటు అప్పజెప్పడంపై మరో వాదన కూడా వినబడుతోంది. ఈ నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ పడిపోయేందుకు కారణమవుతోందని కొందరు విశ్లేషకులంటున్నారు. కర్ణాటకలో మూడు నెలల ముందే ప్రచారం ప్రారంభించినా పార్టీ 122 సీట్లనుంచి 78 సీట్లకు పడిపోవటం రాహుల్‌ నాయకత్వ సామర్థ్యంపై విశ్వాసం కోల్పోయేలా చేస్తుందంటున్నారు.

మరిన్ని వార్తలు