ఎన్నికలకు సిద్ధం!

10 Apr, 2019 01:39 IST|Sakshi

విధుల్లో 80 వేల బలగాలు

55 వేలు రాష్ట్ర పోలీసులు, అనుబంధ శాఖలు

అడిషనల్‌ డీజీ జితేంద్ర వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు తెలంగాణ పోలీసులు సిద్ధమని తెలంగాణ అడిషనల్‌ డీజీ జితేంద్ర (లా అండ్‌ ఆర్డర్‌) వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తెలిపారు. మంగళవారం ఎన్నికల నోడల్‌ అధికారి, ఐజీ సంజయ్‌ జైన్‌తో కలిసి డీజీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పోలీసు బలగాలతోపాటు, కేంద్ర బలగాలు, పొరుగు రాష్ట్రాల పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. ఇప్పటిదాకా రూ.37 కోట్ల వరకు నగదు, రూ.కోటి విలువైన మద్యం, రూ.2.82 కోట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నామని తెలిపారు. 17 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు సరిపడినన్ని బలగాలు ఉన్నాయని, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, ప్రజలు ప్రశాంతంగా ఓటేయాలని భరోసా ఇచ్చారు.

నిజామాబాద్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం, స్థానిక బలగాలతో కూంబింగ్‌ కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సీఈవో ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించారని, ఎన్నికల పరిశీలనాధికారి కేకే శర్మ కూడా ఏర్పాట్లను పరిశీలించారన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో విధుల్లో ఉండే 20,318 మంది పోలీస్‌ అధికారులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించారని చెప్పారు. 410 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 393 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలు నిరంతరం విధులు నిర్వహిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 2,600 సంక్లిష్ట ప్రాంతాలు ఉండగా, అందులో 5,749 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 5 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుందని, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో సాయంత్రం 4 వరకు, నిజామాబాద్‌లో సాయంత్రం 6 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర పోలీసులతోపాటు మొత్తం 80 వేల మంది పోలీసులు పోలింగ్‌ విధుల్లో పాల్గొంటున్నారు. హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, జార్ఖండ్‌ల నుంచి 9,700 మంది పోలీసులు వచ్చారు. ఇప్పటికే సున్నిత, సమస్మాత్మక ప్రాంతాల్లో బలగాల మోహరింపునకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా 400 చెక్‌పోస్టులతోపాటు, పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లోనూ 29 కీలక చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి డిగ్రీ కళాశాలల్లోని కొందరు ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వీరు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు బూత్‌ల వివరాలు చెప్పడం, వారు క్యూలో ఉండేలా చూసుకోవడం తదితర విధులు నిర్వహించనున్నారు.  

మరిన్ని వార్తలు