సీఎం కేసీఆర్‌ సర్వేలన్నీ బోగస్‌   

3 Jul, 2018 14:10 IST|Sakshi
మాట్లాడుతున్న గండ్ర వెంకటరమణారెడ్డి   

టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటమి భయం

వైఎస్సార్‌ హయాంలోనే ప్రాజెక్టుల ప్రారంభం

మాజీ చీఫ్‌విప్‌ ‘గండ్ర’ 

భూపాలపల్లి : సీఎం కేసీఆర్‌ చేయించే సర్వేలన్నీ బోగసేనని మాజీ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ నేతలు తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో ప్రజలకు ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం మాని ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.

ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని, సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆమెను మరువబోమని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రస్తావిస్తే, అతని కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చౌకబారు ఆరోపణలకు దిగడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీ అని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, రుణ మాఫీ, దళితులకు మూడెకరాల భూమి, అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైందని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రానికి నిజమైన ద్రోహులు కేసీఆర్‌ కుటుంబీకులేనని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరిట అధికార పార్టీ అందినకాడికి దోచుకుంటోందని, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనుల్లో  నాణ్యత లోపించిందని, అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కరువైందన్నారు.

కేంద్రం ఇచ్చే కమీషన్‌ను సైతం రేషన్‌ డీలర్లకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుల అండదండలతోనే భూపాలపల్లిలో భూ మాఫీయా కొనసాగుతోందని, ఈ విషయంలో జిల్లా ఎస్పీ కఠినంగా వ్యవహరించి మాఫియా ఆగడాలను అరికట్టాలని కోరారు.

వైఎస్సార్‌ చలవే.. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి చలవ వల్లే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం రైతు సంక్షేమం కోసం జలయజ్ఞం కార్యక్రమాన్ని చేపట్టి ప్రాజెక్టులకు అనుమతులు తీసుకువచ్చాడని గుర్తు చేశారు.

దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా కంతనపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాడని, దీంతో కాంగ్రెస్‌ పార్టీకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం అక్కడి ప్రాజెక్టును తుపాకులగూడెంకు తరలించిందని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చల్లూరి సమ్మయ్య, కటకం జనార్దన్, పిన్‌రెడ్డి రాజిరెడ్డి, ఆకుల మల్లేష్, కొత్త హరిబాబు, నూనె రాజు, గడ్డం కుమార్‌రెడ్డి, సెగ్గెం సిద్ధు, నాగపురి సమ్మయ్య, కరాటే శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు