పవన్‌పై ఆళ్ల నాని ఫైర్‌

28 Jul, 2018 13:55 IST|Sakshi

ఏలూరు : తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతూనే ప్రజలను మభ్య పెట్టేందుకు పవన్‌ కల్యాణ్‌ నాటకాలాడుతున్నారని ఎమ్మెల్సీ, జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వైఎస్‌ జగన్‌ గురించి పవన్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భీమవరంలో సమస్యలపై చర్చకు రావాలంటూ జగన్‌ను ప్రశ్నించడం పవన్‌ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. భీమవరంలో నాలుగు రోజులుగా మకాం వేసిన పవన్‌ ఒక్కసారి కూడా తుందుర్రు ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. తుందుర్రు పోరాట సమితి ఎన్నిసార్లు తమ గోడు వెళ్లబోసుకున్నా కొంచెం కూడా స్పందించని పవన్‌కు జగన్‌ను విమర్శించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గురించి ఆలోచిస్తారు గనుకే జగన్‌ తుందుర్రులో పర్యటించారని పేర్కొన్నారు. ఆక్వా ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టం గురించి ఆయన దృష్టికి రావడంతో అసెంబ్లీలో లేవనెత్తారని గుర్తు చేశారు.

దమ్ముంటే చర్చకు రండి..
పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి బీజం వేసింది దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని ఆళ్ల నాని అన్నారు. జిల్లా అభివృద్ధిపై చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానన్న నాని.. దమ్ముంటే పవన్‌ గానీ, జనసేన నాయకులు గానీ చర్చకు రావాలంటూ సవాల్‌ విసిరారు. రెండేళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి జిల్లాకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారు గనుకే పోలవరం గురించి పవన్‌ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని ఆరోపించారు. అనైతిక రాజకీయాలకు పాల్పడే సంస్కృతి ఉన్నందునే వైస్సార్‌ సీపీ కుటుంబంలోని మహిళ గురించి జనసేన సైనికులు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు
ఎంపీలను కూడగట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడతానంటూ ప్రగల్భాలు పలికే పవన్‌.. ఢిల్లీలో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార చేసినపుడు మాత్రం మొహం చాటేశారని నాని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి, ఆ పార్టీకి అండగా నిలిచే వ్యక్తులకు సరైన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు