‘బాబు 104, 108లను నిర్వీర్యం చేశాడు’

4 Jul, 2020 16:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ: 104, 108 అంబులెన్స్‌ వాహనాల కొనుగోలు విషయంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అత్యంత పారదర్శకంగా వ్యవహరించామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన హయాంలో 104, 108లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. 108, 104 వాహనాల విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అనవసరపు విమర్శలు చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలతో దేశం మొత్తం ఆంద్రప్రదేశ్ వైపు చూస్తోందని తెలిపారు. గత టీడీపీ హయాంలో 108లు మూలన పడ్డాయని, అవి సరిగ్గా పని చేయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 108, 104 వాహనాల కొనుగోలు విషయంలో రివర్స్ టెండరింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా వ్యవహారించిందని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుజాతరావు కమిటీ సిఫార్సుల మేరకు 108,104 వ్యవస్థలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. 2019 జూన్‌లో కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. (చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం)

చంద్రబాబు హయాంలో కాలయాపన కమిటీలు చాలా చూశామని కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో కమిటీ ఏర్పాటు చేశారని ఆళ్ల నాని చెప్పారు. 676 మండలాల్లో 108, 104 నూతన వాహనాలు తీసుకువచ్చారని చెప్పారు. గతంలో 108 వాహనాలు చిన్నపాటి రిపేర్లు వచ్చినా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. 332 పాత 108 వాహనాలు ఉన్నాయని అదనంగా  432  నూతన వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు. అదే విధంగా 676 కొత్త 104 వాహనాలు తీసుకున్నామని తెలిపారు. సర్వీసు ప్రొవైడర్ విషయంలో అరబిందో ఫౌండేషన్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనవరి నెలలో రివర్స్ టెండరింగ్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు దక్కిందని రూ. 2,04 074 కోట్ చేశారని తెలిపారు. 28 వాహనాలకు రూ.1,78,072 ఆదా చేశామని తెలిపారు. రివర్స్ టెండర్ ద్వారా మొత్తం రూ.180 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు. (‘చంద్రబాబు జీవితంలో మారడు’)

నవంబర్ 21 నాడు టెండర్లు పిలిచామని ఎంకేపీ, అరబిందో ఫార్మా సంస్థలు పాల్గొన్నాయని తెలిపారు. బీవీజీ కంపెనీ సమయంలో 1068 మంది పైలెట్లు ఉండేవారని పైలెట్‌కు 10 వేలు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్లకు 12 వేలు జీతం ఇచ్చారని చెప్పారు. పాత వాహనాల్లో రూ.10 వేలు నుంచి రూ.28వేలు వరకు 1690 మంది పైలెట్లకు జీతాలు పెంచామని తెలిపారు. పాత వాహనాల్లో టెక్నిషియన్లకు రూ.12వేలు నుంచి రూ. 30వేలకు పెంచామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినా ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవరించిందని తెలిపారు. అగ్రిమెంట్ జరిగిన తర్వాత రూ.9 పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని చెప్పారు. 1800 వాహనాలు కొనుగోలు చేశామని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. ఉన్నత ఆశయంతో సీఎం వైఎస్‌ ప్రభుత్వం 16 మెడికల్ ఆస్పత్రులను తీసుకురాబోతోందని తెలిపారు. మహాప్రస్థానం పేరుతో సేవలందిస్తున్న వాహనాలు టీడీపీ తన ఖాతాలో వేసుకుంటుందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు