రైతు వ్యవస్థ ఛిన్నాభిన్నం

21 Jan, 2020 05:05 IST|Sakshi
అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆర్కే

బాబు అనుకూల మీడియాతో అవాస్తవాలు చెప్పిస్తున్నారు

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: అధికార వికేంద్రీకరణను మనస్ఫూర్తిగా సమర్ధిస్తున్నానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలో రైతు వ్యవస్థను చంద్రబాబు చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన చంద్రబాబు విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ఆళ్ల మాట్లాడుతూ.. ‘అమరావతిలో రాజధాని వస్తుందని తెలిసి మొదట్లో సంతోషించినా ఆ తర్వాత అందులోని కుట్ర విషయం తెలిసి మోసపోయినట్టు గుర్తించాం. విభజన చట్టం ప్రకారం రాజధాని స్థలం ఎంపిక నుంచి నిర్మాణం వరకు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని తెలిసినా తన స్వార్థం కోసం చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి తరలివచ్చారు. ఆ రోజు శివరామకృష్ణన్‌ కమిటీ 13 జిల్లాలు పర్యటించి అభిప్రాయాలు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలంటే.. అది ప్రభుత్వ భూమి అయితేనే తమకు సమ్మతి అని అప్పట్లో వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. అయితే ఆయన చెప్పిన విషయాన్ని వక్రీకరిస్తున్నారు. చంద్రబాబు అనుకూల మీడియాతో అవాస్తవాలు చెప్పిస్తున్నారు.  

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల భూముల్ని బలవంతంగా లాక్కున్నారు 
రాజధాని ముసుగులో చంద్రబాబు చేసిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ప్రజలకు తెలిసిపోయింది. రాజధాని ప్రాంతంలో ప్రజలకు చంద్రబాబు కంటిమీద కునుకు లేకుండా చేశారు. కౌలురైతుల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ ప్రాంతంలో మూడు నుంచి ఐదు పంటలు పండుతాయి. ఈ భూముల్ని నాశనం చేయవద్దని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును పట్టించుకోలేదు. రాజధాని అంటే అందరిది కావాలి.. కొందరిది కాకూడదు. చంద్రబాబు వల్ల ఈ ప్రాంతంలో రైతులు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరూ నష్టపోయారు. వారి భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. చంద్రబాబు దళిత ద్రోహి. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా? అని అన్నారు.  

15 ఏళ్లకు కౌలు పెంచడం హర్షణీయం 
అందరి అనుమతితోనే పరిపాలన వికేంద్రీకరణకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆలోచనలో నేను కూడా పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నా. రాజధాని ప్రాంతంలో రైతులకు పదేళ్ల నుంచి 15 ఏళ్లకు కౌలు పెంచడం హర్షణీయం. అమరావతిని అగ్రికల్చర్‌ జోన్‌గా ప్రకటించి.. రైతులు సాగు చేసుకుంటామంటే వారి భూముల్ని వారికి తిరిగి ఇవ్వాలి. ల్యాండ్‌ పూలింగ్‌ చట్టాన్ని రద్దు చేయాలి.  

మరిన్ని వార్తలు