రాజధాని పేరుతో బాబు అక్రమాలెన్నో

27 Jun, 2019 04:45 IST|Sakshi

ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆర్కే

తాడేపల్లి రూరల్‌ (మంగళగిరి): రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన అనుచరులు అరాచకాలు సృష్టించి రైతులను భయభ్రాంతులకు గురిచేసి, భూములను బలవంతంగా లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి–అమరావతి కరకట్టపై ప్రజావేదిక తొలగింపు పనులను ఎమ్మెల్యే ఆర్కే బుధవారం పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడినపుడు 2014 డిసెంబర్‌ 31వ తేదీన భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కృష్ణానదిలో పర్యటించి ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ చెప్పి అధికారులకు క్లాసు పీకారని, దానికి అనుగుణంగానే తాడేపల్లి తహసీల్దార్‌ మాజేటి తిరుపతి వెంకటేశ్వర్లు కృష్ణాతీరంలో అక్రమ కట్టడాలను గుర్తించి నోటీసులు అందజేశారని గుర్తు చేశారు.

ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చి అక్రమ కట్టడంలో నివాసం ఉండడంతో ఆ విషయం మరుగున పడిందని విమర్శించారు. అనంతరం ఎటువంటి అనుమతులు లేకుండా రూ.4 కోట్ల వ్యయంతో మొదలు పెట్టిన అక్రమ కట్టడం ప్రజావేదికను రూ.9 కోట్లకు పెంచి..అందులోసైతం రూ.5 కోట్లు మిగుల్చుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆర్కే ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చట్టాలను గౌరవించారు కాబట్టే.. ప్రజావేదికను  తొలగించి, తదితర సామగ్రిని భద్రపరచాలని సూచించారని చెప్పారు. చంద్రబాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని హైదరాబాద్‌లోని తన నివాసానికి సైతం ప్రజాధనాన్ని ఖర్చు చేశారని విమర్శించారు. త్వరలోనే గౌరవ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి మిగతా అక్రమ కట్టడాలను సైతం ప్రభుత్వం తొలగిస్తుందని ఆర్కే స్పష్టం చేశారు.

దౌర్జన్యంతో పంట పొలాలు లాక్కున్నారు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబ సీఎంగా ఉండగా.. కొంతమంది తమపై దౌర్జన్యం చేసి పంట పొలాలను ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు కట్టారని గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన పలువురు రైతులు  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. చంద్రబాబు  ఉండవల్లిలో లింగమనేని ఎస్టేట్‌లో నివాసం ఉండగా దారి కావాలంటూ, తర్వాత ఇస్తామంటూ 10 సెంట్ల స్థలాన్ని తీసుకున్నారని తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న ఎకరంన్నర పొలాన్ని తీసుకున్నారని ఉండవల్లి గ్రామానికి చెందిన దాసరి సాంబశివరావు వివరించారు.  ఆర్కే మాట్లాడుతూ రాజన్న రాజ్యం వచ్చిందని, రాజధాని ప్రాంతంలో రైతులకు ఎటువంటి కష్టాలు ఉండవని, త్వరలోనే రైతుల భూములను రైతులకు అందజేస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు