ఏసీ, ఫ్రిజ్, ఆపిల్, సోఫా..!

7 Jan, 2020 01:48 IST|Sakshi

ఇవీ మున్సిపల్‌ ఎన్నికల గుర్తులు

టీఆర్‌ఎస్‌కు కారు.. కాంగ్రెస్‌కు హస్తం

జాతీయ పార్టీలకు పాత చిహ్నాలే

రిజర్వ్‌ సింబల్‌ లేని పార్టీలకు గుర్తుల కేటాయింపు 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల గుర్తులను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) కేటాయించింది. స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఫ్రీ సింబల్స్‌ జాబితాను విడుదల చేసింది. కొత్త మున్సిపల్‌ చట్టంలో రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పొలిటికల్‌ పార్టీస్, అలాట్‌మెంట్‌ ఆఫ్‌ సింబల్‌ ఆర్డర్‌కు చేసిన సవరణకు అనుగుణంగా కేటాయించే గుర్తులపై స్పష్టతనిచ్చింది. జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు వాటికి రిజర్వ్‌ చేసిన గుర్తులు, రాష్ట్రంలో రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలకు రిజర్వ్‌ చేసిన సింబళ్లు, రిజిస్టరై రిజర్వ్‌ సింబళ్లు లేని పార్టీలు, అభ్యర్థులకు కేటాయించే ఫ్రీ సింబళ్లపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాగా, ఎస్‌ఈసీ వద్ద రిజిస్టరై, రిజర్వ్‌ సింబళ్లున్న రాజకీయ పార్టీలేవి రాష్ట్రంలో లేవని పేర్కొంది. ఎస్‌ఈసీ వద్ద రిజిస్టరై, గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొంది, రిజర్వ్‌ సింబల్స్‌ ఉన్న పార్టీలు, రాష్ట్రంలో రిజిస్టరై రిజర్వ్‌ సింబళ్లు లేని పార్టీలు, ఫ్రీ సింబళ్ల జాబితాను పొందుపరిచింది.

జాతీయ, ప్రాంతీయ పార్టీలకు పాత గుర్తులే.. 
జాతీయ పార్టీలుగా గుర్తింపు పొంది ఎస్‌ఈసీ వద్ద రిజిస్టర్‌ చేసుకున్న కాంగ్రెస్‌కు హస్తం, బీజేపీకి కమలం, సీపీఐకి కంకి కొడవలి, సీపీఎంకు సుత్తి కొడవలి గుర్తులను రిజర్వు చేసింది. తెలంగాణలో గుర్తింపు పొంది ఎస్‌ఈసీ వద్ద రిజిస్టరైన టీఆర్‌ఎస్‌కు కారు, ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం) పార్టీకి గాలిపటం, వైసీపీకి ఫ్యాన్, టీడీపీకి సైకిల్‌ గుర్తులు కేటాయించింది.

ఇతర రాష్ట్రాల్లోని పార్టీలకు కూడా.. 
ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఎస్‌ఈసీ వద్ద రిజిస్టరైన ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ)కి సింహం, జనతాదళ్‌ (యూ)కు బాణం, రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీకి పార–స్టోకర్‌ గుర్తులను ఎస్‌ఈసీ కేటాయించింది. టీజేఎస్, జనసేన, లోక్‌సత్తాలు రిజర్వ్‌ సింబళ్లు లేని పార్టీలు. రాష్ట్రంలో ఎస్‌ఈసీ వద్ద రిజిస్టరై రిజర్వ్‌ సింబళ్లు లేని జాబితాలో మొత్తం 37 రాజకీయ పార్టీలున్నాయి. వాటిలో ప్రధానంగా తెలంగాణ జనస మితి(టీజేఎస్‌), జనసేన, లోక్‌సత్తా పార్టీలతో పాటు యువ తెలంగాణ, సోషల్‌ వెల్ఫేర్‌పార్టీ, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ, అంబేడ్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్, బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌ పార్టీ, తెలుగు కాంగ్రెస్‌ పార్టీ, దళిత బహుజన పార్టీ, గోండ్వానా గణతంత్ర పార్టీ, సమాజ్‌ వాది ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ, ఉత్తరాంధ్ర రాష్ట్ర సమితి, తెలంగాణ యువశక్తి, సోషల్‌ వెల్ఫేర్‌ పార్టీ తదితర పార్టీలున్నాయి.

‘ఫ్రీ సింబల్స్‌’ఇవే.. 
మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు (రిజర్వ్‌ సింబళ్లు కేటాయించిన పార్టీలు,అభ్యర్థులు, స్వతంత్రులకు) ఫ్రీ సింబల్స్‌ 50 గుర్తుల నుంచి కేటాయించే అవకాశాలున్నాయి.. ఏసీలు, ఆపిల్‌ పండు, గాజులు, బ్యాట్, బ్యాటరీ టార్చి, బైనాక్యులర్స్, నీళ్ల బాటిల్, కెమెరా, చెయిన్, కోటు, కొబ్బరి తోట, మంచం, కప్పు సాసర్, విద్యుత్‌ స్తంభం, కవరు, పిల్లన గ్రోవి, ఫుట్‌బాల్, గౌను, గరాటా, గ్యాస్‌ సిలిండర్, గాజు గ్లాసు, హెడ్‌ఫోన్, హాకీ బ్యాట్‌–బంతి, బెండకాయ, పోస్టుబాక్స్, అగ్గిపెట్టె, మూకుడు, ప్యాంటు, పెన్‌డ్రైవ్, పైనాపిల్, కుండ, ప్రెషర్‌ కుక్కర్, ఫ్రిజ్, కత్తెర, సితార్, సాక్స్, సోఫా, స్పానర్, స్టెతస్కోప్, స్టూల్, టెలిఫోన్, టూత్‌బ్రష్, ట్రంపెట్, టైర్లు, ఈల.. ఇవీ పుర ఎన్నికల్లో పోటీపడే.. రిజర్వ్‌ సింబళ్లు లేని అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయిస్తారు.

మరిన్ని వార్తలు