అన్న జనసేన.. తమ్ముడు టీడీపీ!

20 Mar, 2019 19:37 IST|Sakshi

జనసేన నిర్ణయంపై అల్లు భానుమతి ఆగ్రహం

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని మాడుగుల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అన్న జనసేన నుంచి, తమ్ముడు టీడీపీ నుంచి బరిలో నిలువడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ జి రామానాయుడును తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే రామానాయుడు తమ్ముడు సన్యాసినాయుడుకు జనసేన టికెట్‌ కేటాయించింది. ఈ పరిణామాలపై జనసేనలోని కొందరు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకురాలు అల్లు భానుమతి మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, టీడీపీ టై అప్‌ అని.. జనసేనలో టీడీపీ కోవర్టులున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందుగానీ, తరువాత గానీ ఇద్దరు అభ్యర్థులు కలిసిపోతారని అన్నారు. ప్రజలు అమాయకులని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. జనసేన నిర్ణయం తీవ్ర క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే పలు నియోజకర్గాల్లో టీడీపీ, జనసేన టికెట్ల కేటాయింపు గమనిస్తే ఇరు పార్టీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉందనే విషయం అర్ధమవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానాన్ని జనసేన పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించడం టీడీపీ, జనసేనల మధ్య మైత్రికి నిదర్శనమని వారు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు