భారత్‌కు మున్ముందు ముప్పే!

25 Jul, 2018 14:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : క్రికెట్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడం తన దృష్టిలో మోసం కాదని, అది ఆటలో భాగమేనని మాజీ పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజం, ప్రస్తుతం పాక్‌ ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌ అభిప్రాయం. ఈ విషయాన్ని ఆయన 1994లో విడుదల చేసిన తన జీవిత చరిత్ర పుస్తకంలో, ఆ తర్వాత కొన్ని రోజులకే ‘ఛానల్‌–4’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాను కూడా బాల్‌ ట్యాంపరింగ్‌ చేసినట్టు అంగీకరించారు. ఇప్పుడు పాక్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పాక్‌ సైన్యం తనకు సహకరించడం తప్పుకాదని, అది బాల్‌ ట్యాంపరింగ్‌ లాంటిదేనని ఆయన భావిస్తున్నారు.

పౌర ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య సమతౌల్యతను కాపాడుతానని ప్రమాణం చేయడం ద్వారా ఇమ్రాన్‌ ఖాన్‌ పాక్‌ సైనిక మద్దతును సమకూర్చున్నట్లు తెలుస్తోంది. తీవ్రవాద శక్తులు కూడా ఆయనకు మద్దతిస్తున్న విషయం తెల్సిందే. ముంబైలో జరిగిన 26–11 దాడుల్లో హఫీద్‌ సయీద్, లఖ్వీ లాంటి టెర్రరిస్టుల హస్తం ఉందని మొట్టమొదట ధ్రువీకరించినది కూడా ఇమ్రాన్‌ ఖానే. 1996లోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అనేక పరాజయాల అనంతరం పార్టీ తరఫున ఇప్పటి వరకు ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఇప్పుడు ప్రధాని స్థాయి అభ్యర్థిగా ఎదగడం దేశీయ, అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే భారత్‌కు మున్ముందు పాక్‌తో ముప్పుందనే విషయం అర్థం అవుతుంది.

1988 నుంచి పాక్‌ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పాక్‌ సైన్యం గుప్పిట్లోనే బేనజీర్‌ భుట్టో, నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాలు పనిచేశాయి. వీరిద్దరు పరస్పరం ఒకరిపై ఒకరు పాక్‌ సైన్యంతో కలిసి కుట్ర పన్నడం ద్వారా ప్రభుత్వాలను పడగొట్టుకున్నారు. మొదటి నుంచి ఇప్పటి వరకు పాక్‌ విదేశాంగ విధానాన్ని, రక్షణ విధానాన్ని నిర్దేశిస్తున్న పాక్‌ సైన్యానికి 2011 నుంచి పౌర ప్రభుత్వంతో విభేదాలు ప్రారంభమయ్యాయి. అప్పుడు అధికారంలో ఉన్న పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ,  సైన్యం సలహాలను తీసుకోకుండా అప్పటికి పంజాబ్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నవాజ్‌ షరీఫ్‌ పార్టీ సహకారంతో రాజ్యాంగ సవరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రాల అధికారాలను సడలించిన సంస్కరణలు కూడా వాటిలో ఉన్నాయి.

2013లో జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో నవాజ్‌ షరీఫ్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన ప్రధాన మంత్రి అయ్యారు. నాటి నుంచి ఆయన భారత్‌తో శాంతియుత సంబంధాలను కోరుతూ విదేశాంగ విధానాన్ని తన ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. దానికి సైన్యం (ఐఎస్‌ఐ సహా) ససేమిరా అంటూ వచ్చింది. మెల్లగా ఇమ్రాన్‌ ఖాన్‌తో చేతులు కలపడం ప్రారంభించింది. ఎప్పుడూ లేనిది హఠాత్తుగా ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగ సభలకు జనం రావడం ప్రారంభం కావడానికి కారణం ఐఎస్‌ఐ శక్తులే అన్న వాదన వచ్చింది. ఐఎస్‌ఐయే జనాన్ని సమీకరించిందనడానికి ఐఎస్‌ఐతో అంటకాగిన రాజకీయ నాయకుల్లో 90 శాతం మంది ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీలో చేరడమే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ గెలవడం పాక్‌ సైన్యం మొదటి ప్రాధాన్యత కాదని, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడాలనే పాక్‌ సైన్యం కోరుకుంటోందని, రెండో ప్రాథమ్యం మాత్రమే ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ విజయమని ఇస్లామాబాద్‌ మాజీ భారత హైకమిషనర్‌ శరద్‌ సభర్వాల్‌ అన్నారు. హంగ్‌ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాని కార్యాలయం పూర్తిగా తమ గుప్పిట్లోనే ఉంటుందన్నది పాక్‌ సైన్యం అభిప్రాయమని, ఇందులో ఏది జరిగిన భారత్‌కు ప్రతికూలమైన పరిణామమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధం చేస్తే భారత్‌తో గెలవలేమని పాక్‌ సైన్యానికి తెలుసు. టెర్రరిస్టు శక్తులతో భారత్‌లో, ముఖ్యంగా కశ్మీర్‌లో కల్లోలం సష్టించేందుకే ప్రయత్నిస్తుంది.

>
మరిన్ని వార్తలు