మేకప్‌ వేసుకుంటే హీరో.. తీసేస్తే జీరో

4 Nov, 2019 12:50 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ‘ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత ఉన్నమాట  కొంత వాస్తవం. వరదలతోనే ఇసుక కొరత ఏర్పడింది. ఇసుకలో దోపిడీని అరికట్టి నెలరోజుల వ్యవధిలో మంచి పాలసీ తీసుకువద్దామని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇవేమీ పట్టకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్‌ నానాయాగీ చేస్తున్నారు. మనల్ని ఎవరూ పట్టించుకోరనే పరిస్థితిని కార్మికులకు కల్పించారు. వారిద్దరి మాటలతో భవన నిర్మాణ కార్మికులు నైరాశ్యంలో పడిపోయారు’ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల తీరుపై విరుచుకుపడ్డారు. లాంగ్‌ మార్చ్‌ పేరిట పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత దూషణలకు దిగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ పరిష్కార మార్గాలు చూపించలేదు సరికదా... కార్మికుల సమస్యపై ఆయనకు చిత్తశుద్ది లేదనే విషయం స్పష్టం చేసిందన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వరదల ప్రభావం తగ్గిన తర్వాత ప్రతీ వినియోగదారుడికి కూడా ప్రభుత్వం ఇసుక అందిస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు నాగావళి ఇసుకను దోచుకున్నప్పుడు పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పవన్‌ చేత చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో తాము లేమని.. పవన్‌ సినీ హీరో అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రియల్ హీరో అని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్న పవన్‌... సీఎం జగన్‌ పాలనను చూసి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

మేకప్ రాసుకుంటే హీరో.. తీసేస్తే జీరో..
‘మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి గురించి పవన్‌ విమర్శలు సరికావు. ఆఫ్ ది రికార్డ్ ఎవరు మాట్లాడినా అది బహిరంగ వేదికలో చెప్పరు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బొత్స మంచి మెజారిటీతో గెలిచారు. ఇంకో విషయం పవన్ కల్యాణ్.. విజయసాయిరెడ్డితో పోల్చుకోవడం సరికాదు. విజయసాయిరెడ్డి భారతదేశంలో పేరెన్నికగన్న ఆడిటర్. పవిత్రమైన వృత్తిలో ఉన్నారు. ఆయనను అనామకుడి కింద మాట్లాడటం దుర్మార్గం. సినిమాలలో ఎంతో వదులుకుని వచ్చానంటావు. ఏంటి నువ్వు వదులుకుని వచ్చింది. నువ్వు ముఖానికి మేకప్ రాసుకుంటే హీరో. మేకప్ తీసేస్తే జీరో. ఏమి త్యాగం చేసుకుని వచ్చావు చెప్పు. మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దిగజారుడు విమర్శలు చేయద్దు. నీ గెలుపుకోసం భీమవరంలో సూర్యారావు అనే వ్యక్తి డబ్బు పంచారా లేదా? అసలు నువ్వు ఏ సినిమా తీసినా ఆదాయపన్ను లెక్కల్లో చూపించావా? ఈ రోజుల్లో రాజకీయాలలో ఉండేవారు ఏ పరిస్థితులలో జైలుకు వెళ్లివచ్చారో అందరికీ తెలుసు. చిదంబరం ఇప్పుడు జైలులో ఉన్నారు. 50 దేశాలలో అక్రమ సంపాదన ఉందని చిదంబరంపై  కోర్టులలో నివేదికలు సమర్పించారు. అదే చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నపుడు వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డి మీద అసత్య ఆరోపణలతో కేసులు పెట్టారు’ అని ఆమంచి పవన్‌ తీరును విమర్శించారు.

నాదెండ్ల మనోహర్‌ మాట్లాడతారు అనగానే..
‘రూ. 700 కోట్ల నష్టాలలో ఉన్న హెరిటేజ్ సరిగ్గా ఏడాదికే రూ. 2,500కోట్లు లాభాలలోకి ఎలా వచ్చింది. అది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికే ఎలా సాధ్యం. ప్రజల వద్దకు ఎవరు రమ్మంటే వచ్చావు. పవన్ కల్యాణ్ చెప్పే నీతివంతమైన రాజకీయం శుద్ధ అబద్దం. ఇది పవన్ కల్యాణ్ వద్ద ఉన్న వ్యక్తులు చెప్పిన మాట. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి బాస్... నేను మీ పార్టీలోకి వస్తానంటే ఎంపీగా టిక్కెట్టు ఇచ్చి అతడికి ప్రచారానికి కూడా వెళ్లవా.. అతనికి ఓటు వేయమని చెప్పవా. నీతో ప్రవర్తనతో ఆయన తర్వాత రాజకీయాలనుంచి తప్పుకున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పగలరా పవన్‌? నువ్వు నిజంగా బలపడి ఓ స్థానంలోకి వస్తే  మంచిదే. ప్రజాస్వామ్యంలో అందరికి అది మంచిది. నాదెండ్ల మనోహర్‌ మాట్లాడతారు అనగానే పవన్ అభిమానులందరూ సైలెంట్ అయిపోయారు. నాదెండ్ల మనోహర్ లింగమనేనికి బంధువు. లింగమనేని చంద్రబాబుకు బంధువు. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యాలు కూల్చొద్దంటావా? నాదెండ్ల మనోహర్‌ స్క్రిప్టు రాసిస్తే లింగమనేని స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని ప్రస్తావిస్తావా అని పవన్‌ కల్యాణ్‌ తీరుపై ఆమంచి ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం మాదిరి జనసేనను కూడా టీడీపీ శ్రేణులు నాశనం చేస్తున్నారన్న విషయం తెలుసుకోవాలని హితవు పలికారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా