‘టీడీపీలోని కాపు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు’

28 Jun, 2020 19:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో కాపు మహిళలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.354 కోట్ల సహాయం చేశారని వైఎస్సార్‌సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంలో కాపుల కోసం రూ.4769 కోట్ల సంక్షేమం అందించామని గుర్తుచేశారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే పవన్‌ కల్యాణ్‌ వాటిని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సంక్షేమ పథకాలు కాపులకు అమలు చేయలేమని చంద్రబాబు తేల్చిచెప్పారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ కొత్త సంక్షేమ పథకాల్లో కూడా కాపులకు ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవాలని హితవు పలికారు. (‘బాబు కాపులను నమ్మించి మోసం చేశారు’)

కాపులపై ప్రేమ ఉంటే 2014 ఎన్డీఏ ఉమ్మడి ప్రణాళికలో రిజర్వేషన్ల అంశం ఎందుకు చేర్చలేదని ఆమంచి సూటిగా ప్రశ్నించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని పవన్ కాల్యాణ్‌ ఎందుకు హామీ ఇవ్వలేదని మండిపడ్డారు. మంజునాథ కమిటీ పూర్తి నివేదిక రాకుండానే అసెంబ్లీలో చంద్రబాబు చర్చించారని తీవ్రంగా విమర్శించారు. టీడీపీలోని కాపు ఎమ్మెల్యేలు కూడా దీన్ని వ్యతిరేకించారని గుర్తుచేశారు. కాపుల్లోని ఐక్యతను చంద్రబాబు విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ను కాపులే తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. పవన్‌ కల్యాణ్ తన రాజకీయ గురువు చంద్రబాబును వదిలేస్తేనే కనీసం ఎమ్మెల్యేగానైనా గెలుస్తారని ఆమంచి హితవు పలికారు.

మరిన్ని వార్తలు