అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం: అమర్‌సింగ్‌

21 Oct, 2017 17:01 IST|Sakshi

విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులు అందరికీ న్యాయం చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం డిపాజిటర్లకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. శనివారం విజయవాడ విచ్చేసిన ఆయన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ బాధితులకు మేలు జరగాలని అమ్మవారిని వేడుకున్నట్టు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా సమస్య పరిష్కారానికి అందరూ కృషి చేయాలని ఆయన అభిలషించారు. సోదరుడు సుభాష్ చంద్ర తన ఫౌండేషన్ ద్వారా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు.

లాభాపేక్షతో ఈ కార్యక్రమం చేపట్టలేదని, ప్రజల ఇబ్బందులు తీర్చటానికే ముందుకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది ప్రజలకు సంబంధించిన అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబుతో కలిసి కృషి చేస్తున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి చంద్రబాబు, డీజీపీ సాంబశివరావు, కుటుంబరావు తదితర అధికారులు అందిస్తోన్న సహకారం మరువలేనిదన్నారు. ఏపీ అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తామని హామీయిచ్చారు. రాజకీయాలు మాట్లాడటానికి దేవాలయం వేదిక కాదని, మరోసారి వచ్చినపుడు రాజకీయాల గురించి మాట్లాడతానని అమర్‌సింగ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు