అమరావతిలో బాబుకు నిరసన సెగ

28 Nov, 2019 10:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా అమరావతిలో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని పేరుతో భూములు దోచుకున్న చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించవద్దంటూ రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మా ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించిన తర్వాతే రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. రాజధాని కోసం ల్యాండ్‌పూలింగ్‌ పేరిట చంద్రబాబు పెద్ద ఎత్తున రైతుల నుంచి భూములు సేకరించిన సంగతి తెలిసిందే. అయితే, తమ నుంచి సేకరించిన భూములకు బదులుగా కనీసం ప్లాట్లు కూడా ఇవ్వకపోవడంతో తమ జీవితాలు రోడ్డునపడ్డాయని పలువురు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ నిరసనకు దిగారు. బాబూ.. నీ వల్ల మా బతుకులు బుగ్గిపాలయ్యాయంటూ భగ్గుమంటున్నారు. రైతులకు తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించవద్దంటూ ఆందోళన చేపట్టారు.


అయితే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై టీడీపీ శ్రేణులు గుండాయిజానికి దిగారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన రైతులపై దాడులకు దిగారు. దీంతో అమరావతిలోని వెంకటాయపాలెంలో వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

రౌడీల్లా ప్రవర్తించిన టీడీపీ కార్యకర్తలు!
చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న తమను రెచ్చగొడుతూ.. దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా వచ్చారని తెలిపారు. చంద్రబాబు అన్యాయం చేశారనే నిరసన తెలిపేందుకు ఇక్కడికి వచ్చామని, తమపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారని తెలిపారు. టీడీపీ నేతలు బయటినుంచి జనాలను తీసుకొచ్చారని, మద్యం మాఫియా, ఇసుక మాఫియా వాళ్లు తప్ప చంద్రబాబు వెంట ఎవరూ కనిపించడం లేదని రైతులు అంటున్నారు. అసైన్డ్‌ రైతులంటే చంద్రబాబుకు అంత అలుసా? అని వారు ప్రశ్నించారు.  చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నిరసన తెలిపేందుకు కనీసం తమను రోడ్డు మీదకు రానివ్వలేదని, రైతు అనేవాడు ఉండకూడదనేది చంద్రబాబు ఆలోచన అని రైతులు ధ్వజమెత్తారు. జరిగిన అన్యాయంపై నిరసన తెలుపుతుంటే.. విజయవాడ, గుంటూరు నుంచి గుండాలను తీసుకొచ్చి తమ దాడి చేశారని రైతులు మండిపడుతున్నారు. చంద్రబాబు రైతు ద్రోహి అని విమర్శిస్తున్నారు.

కరకట్ట నుంచి రాయపుడి వరకు నిరసన ఫ్లెక్సీలు
ఉండవల్లిలోని  తన నివాసం నుంచి చంద్రబాబు రాజధాని పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఉన్నారు. వెంకటాయపాలెం,ఉద్దండరాయ పాలెం, నేలపాడు, రాయపూడి, ఐనవోలు తదితర గ్రామాల మీదుగా చంద్రబాబు పర్యటన సాగుతోంది. రాజధాని పర్యటనలో అడుగడుగునా చంద్రబాబును రైతులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు రాజధాని పర్యటనకు రావొద్దంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరకట్ట నుంచి రాయపుడి వరకు ఈ నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.

చంద్రబాబుపై ప్రశ్నల వర్షం
‘రాజధాని పేరుతో రైతులను మోసం చేశావు. చంద్రబాబూ.. ఏం మొహం పెట్టుకొని రాజధానిలో పర్యటిస్తున్నావు’ అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ‘రాజధాని పేరిట గ్రాఫిక్స్‌ చూపించి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు? ఇలా మోసం చేసినందుకు చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాతే రాజధానిలో చంద్రబాబు అడుగుపెట్టాలి’ అంటూ ఫెక్సీల్లో రైతులు నినదించారు. ‘ రాజధాని ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్న హామీని ఎందుకు అమలుచేయలేదు? గ్రామకంఠాల సమస్యను చంద్రబాబు ఎందుకు పరిష్కరించలేదు? యువత ఉపాధి కోసం ఇస్తానన్న రూ. 25లక్షల వడ్డీలేని రుణం హామీ గుర్తుకురాలేదా? రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయి? మూడేళ్లలో అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తానన్న ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? జీవో 41తో అసైన్డ్‌ భూములను సాగుచేస్తున్న దళితులకు అన్యాయం చేశారు. పట్టా భూములకు ఒక ప్యాకేజీ.. దళితుల అసైన్డ్‌ భూములకు మరో ప్యాకేజీ ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు దళిత ద్రోహి. మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం, మీ ప్రయోనాల కోసం రాజధానిపై రాజకీయాలు చేయొద్దు. మా జీవితాలతో ఆడుకోవద్దు’ అంటూ ఫ్లెక్సీల్లో రైతులు నిప్పులు చెరిగారు.

మరిన్ని వార్తలు