ఆయన చదివింది ఐఐటీలోనేనా?

5 Nov, 2018 03:37 IST|Sakshi
అరవింద్‌ కేజ్రీవాల్‌, అమరీందర్‌ సింగ్‌

కేజ్రీవాల్‌పై పంజాబ్‌ సీఎం ఫైర్‌

చండీగఢ్‌: ఢిల్లీలో వాయు కాలుష్యం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పంజాబ్‌లో పంట వ్యర్థాలను దహనంచేయడం వల్లే కాలుష్యం పెరుగుతోందన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకోసం కేజ్రీవాల్‌ ఉపగ్రహ చిత్రాల్ని రుజువుగా చూపడం హాస్యాస్పదమని అన్నారు. అసలు కేజ్రీవాల్‌ ఐఐటీలోనే చదివారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పాఠశాల విద్యార్థికి ఇంత కన్నా మంచి అవగాహన ఉంటుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ కాలుష్యానికి పంజాబ్‌ను నిందించడానికి ముందు కేజ్రీవాల్‌ వాస్తవాలు గ్రహించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం జరగని రోజుల్లో కూడా ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ మెరుగ్గా లేద న్నారు. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ మీదుగా వీస్తున్న గాలులు వాయవ్యం నుంచి తూర్పు దిశగా మళ్లాయని, కాబట్టి పంజాబ్, హరియాణాల పంట వ్యర్థాల దహన ప్రభావం ఢిల్లీపై లేదని వాతావరణ శాఖ నివేదిక ఇచ్చిందన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు