సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

6 Jun, 2019 16:53 IST|Sakshi

చండీగఢ్‌ : మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశానికి డుమ్మా కొట్టారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు ఉద్దేశించి.. సీఎం అమరీందర్‌ కేబినెట్‌ సమావేశం నిర్వహించగా.. దానికి హాజరుకాకుండా సిద్ధూ తన అసమ్మతిని తెలియజేశారు. ఈ క్రమంలో సిద్ధూకు అమరీందర్‌ సింగ్‌ షాక్‌ ఇచ్చారు. సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలలో కీలకమైన స్థానిక సంస్థల శాఖను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్ధూ కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితమయ్యారు. 

తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కాంగ్రెస్‌ నేతలైన అమరీందర్‌, సిద్ధూల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అమరీందర్‌ నేతృత్వంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) భేటీలోనూ సిద్ధూ పాల్గొనలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు ఉద్దేశించిన ఈ సమావేశంలో సిద్ధూ పనితీరుపై అమరీందర్‌ ఘాటు విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాలు రావడానికి సిద్ధూ అసమర్థతే కారణమని ఆయన నిందించారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సిద్ధూ.. అమరీందర్‌ విమర్శలను తిప్పికొట్టారు. తన పేరును ప్రస్తావించి మరీ.. ఫలితాల విషయంలో తనను నిందిస్తున్నారని, నిజానికి తనకు అప్పగించిన రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టిందని ఆయన అన్నారు. ఇష్టమొచ్చినట్టుగా తనపై విమర్శలు చేయడం సరిసకాదని, తాను కష్టపడి పనిచేస్తున్నానని, తాను పంజాబ్‌ ప్రజలకు జవాబుదారుడినని సిద్ధూ అన్నారు.

మరిన్ని వార్తలు