పారదర్శకంగా ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకే సంస్కరణలు

30 May, 2020 04:05 IST|Sakshi

అందులో భాగంగానే ఎస్‌ఈసీగా హైకోర్టు రిటైర్డు జడ్జి నియామకం 

ఆయన పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహిస్తే పారదర్శకంగా ఉంటుందన్న ప్రజాస్వామ్యవాదులు

నిమ్మగడ్డ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని.. వాటికి ఆధారాలు ఉన్నాయన్న బీజేపీ ఎంపీ జీవీఎల్‌ 

ఈ తీర్పుపై ‘సుప్రీం’కు వెళ్తాం: అంబటి  

ప్రజా ప్రభుత్వాన్ని మరో వ్యవస్థ నియంత్రించాలనుకోవడం సరికాదు: స్పీకర్‌ తమ్మినేని

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విప్లవాత్మక సంస్కరణల అమలులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా హైకోర్టు రిటైర్డు జడ్జి వి.కనగరాజ్‌ను సర్కారు నియమించింది. హైకోర్టు రిటైర్డు జడ్జి పర్యవేక్షణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంవల్ల పోటీచేసే అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రశంసించారు. కానీ.. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కొనసాగించాలని శుక్రవారం  హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై వివిధ పార్టీల ప్రముఖులు స్పందిస్తూ తమ అభిప్రాయాలు తెలిపారు. 

టీడీపీకి అనుకూలంగా నిమ్మగడ్డ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించే క్రమంలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని, వాటికి సంబంధించి పలు ఆధారాలు కూడా ఉన్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వెల్లడించారు. రాజ్యాంగ పదవిని నిర్వహించే వారికి రాజ్యాంగ విధులు తెలిసి ఉండాలనే అంశాన్ని నిమ్మగడ్డ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 

రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ రాజ్యాంగబద్ధమే: ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్థూలంగా నిర్ణయం తీసుకుందని.. హైకోర్టు తీర్పులోని పూర్వాపరాలను న్యాయనిపుణులు అధ్యయనం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమ పార్టీకి, ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందన్నారు. న్యాయస్థానాలిచ్చే తీర్పుల్లో కొన్ని సందర్భాలలో న్యాయం జరగలేదనే అభిప్రాయం ఉండటం సహజమని, అలాంటపుడు పై కోర్టుల్లో అప్పీల్‌ చేసుకునే రాజ్యాంగ హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన స్థానంలో ఉండి రమేశ్‌కుమార్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం శాఖకు ఆయన రాసిన లేఖ అందుకు ఓ ఉదాహరణని అభిప్రాయపడ్డారు. 

పాలనా వ్యవస్థను అదుపుచేయడం సరికాదు: స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పందిస్తూ.. రాజ్యాంగ వ్యవస్థలు హద్దులు పాటించాలని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మరో వ్యవస్థ నియంత్రించాలనుకోవడం సరికాదన్నారు. ఈ విషయంపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. న్యాయ వ్యవస్థ ద్వారా పాలనా వ్యవస్థను అదుపు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. 

నిష్పక్షపాతంగా నిర్వహించేందుకే.. 
స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నూతన జవసత్వాలు చేకూర్చడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డు జడ్జిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించింది. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం–1993లో సెక్షన్‌–200కు సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఏప్రిల్‌ 10న ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా నాటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీకాలం ముగిసింది. దీంతో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డు హైకోర్టు జడ్జి వి.కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా గవర్నర్‌ నియమిస్తూ గత ఏప్రిల్‌ 11న ఉత్తర్వులు జారీచేశారు. 

మరిన్ని వార్తలు