నేతలను వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజం 

11 Dec, 2018 04:03 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

సత్తెనపల్లి: రాజకీయాలలో నేతలను చివరి వరకు ఉపయోగించుకొని వదిలేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. సత్తెనపల్లి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే టికెట్‌ వస్తేనే గొప్ప వారు అనుకోవడం పొరపాటని, టికెట్‌ రాని వారికి రాజకీయ పార్టీలు ఇతర బాధ్యతలను అప్పగిస్తాయన్నారు. గెలుపు గుర్రాలపైనే రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తాయని.. ఇది ఎన్నికల్లో సర్వసాధారణమన్నారు. వైఎస్సార్‌ సీపీలో టికెట్‌ ఇవ్వలేకపోతే వారిని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరింత ప్రేమగా చూసుకుంటారని చెప్పారు. నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు చేర్పులు అధిష్టానవర్గ నిర్ణయంపై ఉంటాయన్నారు.

సోషల్‌ మీడియాలో తనపై కూడా ఎన్నో పుకార్లు వస్తున్నాయని అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి పుకార్లు తన రాజకీయ అనుభవంలో ఎన్నో చూశానని, వీటిని పట్టించుకుంటే రాజకీయాలు చేయలేమన్నారు. వైఎస్సార్‌ హయాంలో తాను రెండు సార్లు పోటీ చేయలేదని అయినప్పటికీ తనను పక్కన పెట్టకుండా ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమించారన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ ధర్మాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో 5 లక్షల ఓట్లతో ఓటమి పాలయ్యామని, నిరంతరం ప్రజల మధ్య ఉండి వైఎస్‌ జగన్‌ పోరాడుతున్నారని ఆయన బాటలోనే అందరం నడుస్తున్నామన్నారు. తాను ఏడేళ్ల నుంచి నియోజకవర్గంలో గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం మొత్తం పర్యటించానన్నారు. తాము నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ప్రజలతో మమేకమవుతామన్నారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం  నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ గీతా హాసంతి తదితత నేతలు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు