సిరా ఆరకముందే 80% హామీల అమలు

17 Jul, 2019 04:56 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నాం  

టీడీపీ తమ మేనిఫెస్టోను టిష్యూ పేపర్‌లా విసిరేసింది  

అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు  

సాక్షి, అమరావతి: చేతి వేలిపై ఎన్నికల సిరా గుర్తు ఆరకముందే 80 శాతం హామీలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశంసించారు. ప్రజల తలరాతను మార్చే బడ్జెట్‌ను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా పవిత్ర గ్రంథంలా భావిస్తున్నామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను టిష్యూ పేపర్‌లా విసిరిపారేసిన చరిత్ర టీడీపీదని విమర్శించారు. కాపుల సంక్షేమానికి సీఎం వైఎస్‌ జగన్‌ బడ్జెట్‌లో పెద్దపీట వేశారన్నారు. కాపు కార్పొరేషన్‌కు తొలి ఏడాదిలోనే రూ.2 వేల కోట్లు కేటాయించి మాట నిలబెట్టుకున్నారన్నారు. కాపులకు టీడీపీ ఇచ్చిన మూడు హామీలను అమలు చేయలేదని ధ్వజమెత్తారు.

కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. కాపు సంక్షేమానికి ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. కాపులకు రాజకీయంగా ప్రాధాన్యమిస్తానని చెప్పి అప్పటి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కనీసం హెడ్‌ కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేసే అధికారం లేకుండా చేశారని విమర్శించారు. కానీ తమ అధినేత వైఎస్‌ జగన్‌ సాధ్యమయ్యే హామీలనే ఇచ్చి నిజాయతీగా కాపుల మనసు గెలుచుకున్నారని ప్రశంసించారు. కాపులను బీసీల్లో చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తమ పార్టీ మొదటి నుంచీ చెబుతూ వచ్చిందన్నారు. తన చేతిలో లేని హామీని ఇవ్వలేనని జగ్గయ్యపేట బహిరంగ సభలోనే జగన్‌ ప్రకటించారని గుర్తు చేశారు. కానీ కాపు కార్పొరేషన్‌కు ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి పాటుపడతానని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు.  

కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధతా ఉందా? లేదా?: మంత్రి బొత్స  
కాపులకు 5 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. కేంద్రం ఈబీసీలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తాను తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత ఉందో.. లేదో చంద్రబాబు గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. గత కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కాపుల రిజర్వేషన్‌పై రాజ్యాంగ సవరణ ఎందుకు చేయించలేకపోయారని ప్రశ్నించారు. కాగా.. కాపు ఉద్యమం సమయంలో రాయలసీమ రౌడీలు తునిలో రైలు దహనం చేశారని టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. మరి టీడీపీ ప్రభుత్వం ఎందుకు నిరూపించలేకపోయిందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. తనతోపాటు బొత్స, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తదితరులపై ఎందుకు కేసులు పెట్టారని నిలదీశారు. అన్యాయంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాయలసీమ రౌడీలు తునిలో రైలు దహనం చేశారని చినరాజప్ప చేసిన ఆరోపణను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తిప్పికొట్టారు. ‘మరి సీమ నుంచి రౌడీలు వస్తే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాపై ఎందుకు కేసులు పెట్టారు’ అని ఆయన ప్రశ్నించారు. అసలు కాపులు బీసీలా? ఓసీలా? అన్నది చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు