వికేంద్రీకరణకు బీజేపీ అనుమతి అక్కర్లేదు

26 Jan, 2020 05:14 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి: అధికార వికేంద్రీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, అందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని, దానితో కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మూడు రాజధానులు, హైకోర్టు ఏర్పాటుపై బీజేపీ నేతల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని పేర్కొన్నారు. అంబటి రాంబాబు ఇంకా ఏం చెప్పారంటే... 

‘‘రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అవసరమని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. గ్రామస్థాయి నుంచి అధికార వికేంద్రీకరణ జరుగుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ కూడా అందులో భాగమే. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. హైకోర్టు శాశ్వతంగా రాయలసీమలోనే ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు బీజేపీ చెప్పింది. ఏపీ ఎన్నికల మేనిఫెస్టోకు బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేరా అన్న విషయం ప్రజలకు తెలియజేయాలి. హైకోర్టుపై బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందో లేదో సమాధానం చెప్పాలి. అమరావతిలో రాజధాని నిర్మాణం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మారిందని బీజేపీ చెప్పిన మాట నిజం కాదా? అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు బీజేపీ అండదండలు ఇంకా దేనికి? బీజేపీ, జనసేన పార్టీలు చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నాయి. ఎన్నికల్లో అఖండ మెజార్టీ కట్టబెట్టిన ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఉంది.  

బాబు మాటలు హాస్యాస్పదం 
మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది. చంద్రబాబు నిర్ణయాలను అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చంద్రబాబు నాయుడే. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కూడా ఆయనే. శాసన మండలిలో కీలకమైన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని, మండలి చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చారు. దొంగే దొంగ.. దొంగ అన్నట్లు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని బాబు మాట్లాడటం హాస్యాస్పదం. వికేంద్రీకరణను దెబ్బతీసేందుకు చంద్రబాబు అన్ని రకాల కుట్రలు చేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు దయ్యబట్టారు.

మరిన్ని వార్తలు