శాంతి భద్రతల వైఫల్యానికి బాబే కారణం

23 Oct, 2018 04:33 IST|Sakshi

మీ అసమర్థతను విపక్షంపైకి నెడతారా?: అంబటి

పోలీసు సంస్మరణ దినోత్సవంలో సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా విఫలం కావటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరే కారణమని వైఎస్సార్‌ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైకి నెట్టే దుర్మార్గానికి ఒడిగడుతున్నారని మండిపడ్డారు. సోమవారం అంబటి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పోలీసు సంస్మరణ దినోత్సవం వేదిక నుంచి చంద్రబాబు వైఎస్సార్‌ సీపీపై విమర్శలు చేయడం అభ్యంతరకరమన్నారు. తునిలో రైలు దగ్ధం, రాజధానిలో చెరుకు తోటలకు నిప్పంటించిన ఘటనల వెనుక టీడీపీకి చెందిన వ్యక్తులే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ విషయాలు బయటపడతాయనే భయంతోనే దర్యాప్తు అధికారులను బదిలీ చేశారని చెప్పారు. ప్రభుత్వ అసమర్థతను తమపై రుద్దే యత్నం చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విపక్షానికి చెందిన 200 మందిని హతమార్చారు
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 200 మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నేతలను పోలీసుల సహకారంతో హతమార్చారని అంబటి ఆరోపించారు. నారా హమారా–టీడీపీ హమారా సభలో చంద్రబాబు అన్యాయాలను నిలదీసిన ముస్లిం యువకులను దేశద్రోహులుగా చిత్రీకరించి జైల్లో పెట్టారన్నారు. టీడీపీ నేతలపై ఐటీ సోదాలు నిర్వహించే అధికారులకు పోలీస్‌ రక్షణ కల్పించబోమని చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలోనే ప్రకటించారని, ఇదేనా ఆయన 40 ఏళ్ల పాలనా దక్షత? అని ప్రశ్నించారు.

దళితులపై దాడుల్లో 4వ స్థానంలో ఏపీ
విజయవాడ కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో సుమారు 200 బ్లూఫిలింలు దొరికినట్లు పచ్చ మీడియాలోనే వార్తలు రావటంతో చంద్రబాబు టీడీపీ నేతలను కాపాడే యత్నం చేశారని అంబటి ఆరోపించారు. జాతీయ నేర గణాంకాల బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా దళితులపై దాడుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని, అసోసియేషన్‌ డెమోక్రటిక్‌ రిఫారŠమ్స్‌ సంస్థ నివేదిక ప్రకారం మహిళలపై వేధింపుల్లో ఏపీ  నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. ఇందులో ఐదుగురు టీడీపీ ప్రజాప్రతినిధులున్నారని తెలిపారు. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్‌ కోడెలపై కేసులు ఎత్తివేస్తూ జీవో జారీ చేయడం అత్యంత ఘోరం కాదా? అని ప్రశ్నించారు. #తహసిల్దార్‌ వనజాక్షిని జుట్టుపట్టి కొట్టిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఏ చర్య తీసుకున్నారని నిలదీశారు. 

మరిన్ని వార్తలు