23న చంద్రబాబు దిగిపోవడం ఖాయం

7 May, 2019 04:45 IST|Sakshi
మాట్లాడుతున్న అంబటి, చిత్రంలో నాగిరెడ్డి

చంద్రబాబు ఇక జీవితంలో కేబినెట్‌ సమావేశం నిర్వహించలేరు

ఓటమిని ఈసీ, ఈవీఎంలపై నెట్టే ప్రయత్నం 

వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, ఎంవీఎస్‌ నాగిరెడ్డి  

సాక్షి, అమరావతి: సీఎం పీఠం నుంచి ఈ నెల 23 తర్వాత చంద్రబాబు దిగిపోవడం ఖాయం.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అందుకే  కేబినెట్‌ 10వ తేదీన నిర్వహిస్తామని అంటున్నారు.. ఓటమి భయం పట్టుకోవడంతో చంద్రబాబు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు.. అంటూ వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సోమవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాబోయే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే కేబినెట్‌ మీటింగ్‌ అంటూ హడావుడి చేస్తున్నారు. ఈ నెల 23 తర్వాత చంద్రబాబు జీవితాంతం కేబినెట్‌ సమావేశం నిర్వహించలేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. తన ఓటమిని ఎన్నికల కమిషన్‌ (ఈసీ), ఈవీఎంలపై నేట్టే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నూటికి నూరుపాళ్లు టీడీపీ అధికారం కోల్పోతుంది. ప్రజలంతా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావాలన్న నిర్ణయంతో ఓట్లు వేశారని మే 23వ తేదీ తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అన్నారు. టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నాడని ఇంటిలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంటకేశ్వరరావుపై ఫిర్యాదు చేస్తే... చంద్రబాబు చిందులు తొక్కారన్నారు. 

అప్పటి నీ మాటలు గుర్తుకు తెచ్చుకో ‘బాబు’  
ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, అధికారులు అందరూ ఎన్నికల కమిషన్‌ పరిధిలోనే ఉండాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పట్లో చెప్పిన ఆయన ఇప్పుడు సీఎంగా ఉంటే చట్టాలు, నియమాలు మారిపోతాయా? అని ప్రశ్నించారు. 

ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఏపీపీఎస్సీ... 
ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగా ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 పరీక్షలో ఓటర్లను ప్రభావితం చేసేలా టీడీపీ, చంద్రబాబు చుట్టూ తిరిగే ప్రశ్నలను అడిగారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీళ్లిస్తానని ఇవ్వకుండా ఇప్పుడు ప్రాజెక్టును సందర్శించి సమీక్షలు చేసే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 

ఎన్నికల సంఘంలోనే టీడీపీ కోవర్టులు: నాగిరెడ్డి 
దేశ చరిత్రలో ఎవరూ ఉల్లంఘించనన్ని ఉల్లంఘనలు ఈ ఎన్నికల్లో బాబు పాల్పడ్డారని నాగిరెడ్డి విమర్శించారు. ఎన్నికల కమిషన్‌లోనే టీడీపీ కోవర్టులను చొప్పించారని, వారు అధికార పార్టీకి సమాచారం చేరవేస్తున్నారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు