ఆస్తులు పోతాయన్న భయంతోనే ఉద్యమం..

18 Jan, 2020 16:13 IST|Sakshi

సాక్షి, గుంటూరు : అభివృద్ధి వికేంద్రీకరణకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఆయన ట్రాప్‌లో రైతులు ఎవరు పడొద్దని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రజలకు హితబోద చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలు రాకూడదనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చారని పేర్కొన్నారు.అమరావతిలో భూములు కొన్నవారే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే బాబుకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు కేవలం తన ఆస్తులు పోతాయన్న భయంతోనే ఉద్యమం చేపట్టారని విమర్శించారు. అందుకోసమే బాబు జోలే పట్టుకొని నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. దయచేసి రైతులెవరు ఆయన ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్‌ నాయకత్వంలో నిజమైన రైతులకు ఎప్పటికి అన్యాయం జరగదని, నిజంగానే రైతుకు నష్టం జరిగితే వారి సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అంబటి వెల్లడించారు. 
చదవండి : బాబూ.. రేపు సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచుతాం!

చదవండి : బినామీ భూముల కోసం చంద్రబాబు ఆరాటం

మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని పేర్కొన్నారు. ప్రాంతీయ అసమానతల వల్లే ఉద్యమాలు వస్తున్నాయని గత నివేదికలు తేల్చాయని స్పష్టం చేశారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆయనకు లేకపోవడం సిగ్గుచేటన్నారు. అమరావతికి ఏదో జరిగిపోతుందంటూ చంద్రబాబు అసమానతలు ఏర్పరిచి కులాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడుతున్నారని మోపిదేవి మండిపడ్డారు. రాజధాని ఎక్కడికి తరలిపోవడం లేదని, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి తెలిపారు.

హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. రాజధానిపై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు. రాజధాని పేరిట శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు తుంగలో తొక్కారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేదే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని తెలిపారు. వైఎస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే చంద్రబాబు ఇలా దొంగ ఉద్యమాలకు తెర తీశారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు తమ మద్దతు తెలపాలని తాను కోరుతున్నట్లు స్పష్టం చేశారు.
చదవండి : ఈలోగా ఇటు వాళ్లను అటు పంపిస్తాడు!

మరిన్ని వార్తలు