నిలదీస్తానని ఢిల్లీ వెళ్లి..వంగి వంగి దండాలు

18 Jun, 2018 02:05 IST|Sakshi

సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత అంబటి ధ్వజం

విజయవాడ సిటీ: ప్రధాని మోదీని నిలదీస్తానని ఘీంకరిస్తూ ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు చివరకు ఆయనకు వంగి వంగి సలాములు చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు పోరాటాలు చేసే వ్యక్తి కాదని, ఆయన ఓ అవకాశవాది అని, అందితే జుట్టు, లేకుంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి అని అంబటి ధ్వజమెత్తారు. విజయవాడలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానన్న చంద్రబాబు అక్కడకు వెళ్లి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తూ తన ఉగ్రరూపం చూడనున్నారని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారనీ, పచ్చ పత్రికల్లో పుంఖానుపుంఖానులుగా కథనాలు అచ్చు వేయించుకున్నారని విమర్శించారు.

అయితే వాస్తవంగా జరిగింది చంద్రబాబు మోదీకి వంగి వంగి దండాలు పెట్టడమే అని అంబటి చెబుతూ.. ప్రధానితో చంద్రబాబు ఉన్న ఫోటోలను విలేకరులకు చూపారు. మోదీని కలిసిన సమయంలో చంద్రబాబు ముఖంలో ఓ పక్క భయం, మరో పిచ్చినవ్వు కన్పించిందని ఎద్దేవా చేశారు. అవినీతి ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏమి మాట్లాడతారని ప్రశ్నించారు. ఢిల్లీ వేదికగా మరోసారి రాష్ట్రాన్ని ముంచారని ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీ లాలూచీ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని అంబటి మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల తరువాత చంద్రబాబుపై కేసులు పెడతామంటూ హూంకరించిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదనీ, అలాగే ప్రధానమంత్రి మోదీకి సంబంధించిన అవినీతి కేసును బయటపెడతామంటూ ఇక్కడి టీడీపీ వారు సవాల్‌ చేయడం చూశామని, అటు తరువాత ఇద్దరూ  చప్పబడిపోవడం తప్ప వాస్తవాలు బయటకు రావడం లేదన్నారు. ఇది వీరిద్దరి మధ్య లాలూచికి నిదర్శనం కాదా? అని అంబటి ప్రశ్నించారు.

అది బూటకపు సర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తిరిగి చంద్రబాబు అధికారంలోకి వస్తారంటూ చేసిన సర్వేలు ఎవరి కోసం, ఎవరు చేయిస్తున్నారో ప్రజలందరికీ తెలుసని అంబటి అన్నారు. అయినా 18 నియోజకవర్గాల్లో సర్వే చేసి, 175 నియోజకవర్గాలకు లెక్కగట్టడంలోనే ఆ సర్వే విశ్వసనీయత తేటతెల్లం అవుతోందన్నారు. ఆ బూటకపు సర్వేను ముద్రించిన పత్రిక, ప్రసారం చేసిన ఆ చానల్‌ ఎవరికి ఊడిగం చేస్తున్నాయో, అలానే ఆ సర్వే సంస్థ కూడా ఎవరి మెప్పు కోసం పాకులాడుతోందో అందరికీ తెలిసిన విషయమే అన్నారు.
 
జగన్‌ ప్రజాదరణను చూసి ఓర్వలేక..
ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న యత్నాల్లో భాగంగానే ఇటువంటి సర్వేలతో హడావుడి చేస్తున్నారని అంబటి విమర్శించారు. ఇది ఒక విధమైన మైండ్‌ గేమ్‌ అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదనీ, ఇకపై ఆయన అవినీతిని తట్టుకోడానికి ప్రజలు సిద్ధంగా లేరనీ చెప్పారు.  

మరిన్ని వార్తలు