ప్రజల రక్తాన్ని పీల్చే జలగ చంద్రబాబు 

11 Aug, 2019 04:19 IST|Sakshi

ఐదేళ్లలో ఆయన పాలిచ్చి మేపిన వారు అవినీతి సొమ్ముతో తెగ బలిశారు

ట్విట్టర్‌లో ఆశా వర్కర్లపై తప్పుడు ఫొటోలు పెడతారా..

వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజం  

సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు తనను తాను పాలిచ్చే ఆవుగా చెప్పుకుంటున్నారని, వాస్తవానికి ఆయన ప్రజల రక్తాన్ని పీల్చే జలగ అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఐదేళ్లలో మీరిచ్చిన పాలు తాగి మీ పక్కనున్న వారు, మీ వర్గం వారి సైజులే తెగ బలిశాయని దుయ్యబట్టారు. తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైన తర్వాత శనివారం అక్కడే జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి అయ్యీ కాక ముందే చంద్రబాబు అబద్ధాలను అల్లి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న తరువాత అధికారంలోకి వచ్చిన జగన్‌ అవినీతిలేని పాలనను అందించాలని చిత్తశుద్ధితో ముందుకు వెళుతూ ఉంటే చంద్రబాబు ఓర్వలేకుండా ఉన్నారని మండిపడ్డారు.

జగన్‌ తన పాదయాత్రలో ఆశా వర్కర్లకు రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు వేతనం పెంచుతామని వాగ్ధానం చేశారని, ఆ మేరకు అధికారంలోకి రాగానే ఈ పెంపునకు సంబంధించి జీవోను జారీ చేశారని అంబటి చెప్పారు. చంద్రబాబు ట్విట్టర్‌లో జగన్‌ ఫోటోకు ఆశా వర్కర్లు పాలాభిషేఖం చేస్తున్నట్లు ఒక ఫోటోను పెట్టారని, ఆ కిందనే తెలంగాణలో 2015లో జరిగిన ఉద్యమం తాలూకు ఫోటోను జత చేసి, ‘అప్పుడు... ఇప్పుడు’ అంటూ వ్యాఖ్యానించి ప్రజలను మభ్యపెట్టాలని చూశారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా? అని అంబటి ప్రశ్నించారు. బందరు పోర్టును తమ ప్రభుత్వమే నిర్మిస్తుందని సంబంధిత శాఖ మంత్రి ఇటీవల శాసనసభలో స్పష్టంగా సమాధానం చెప్పారని, అయినప్పటికీ చంద్రబాబు, ఆయన వంది మాగధులు పోర్టును కేసీఆర్‌కు అమ్మేస్తున్నారంటూ విష ప్రచారం చేయడం దారుణమన్నారు. 

చంద్రబాబు పిచ్చి మాటలు మానుకోవాలి.. 
పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నను తెచ్చుకున్నారని చంద్రబాబు మాట్లాడటంపై అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయ్యా చంద్రబాబు గారూ... మీ ఐదేళ్ల పాలనలో మీరిచి్చన పాలు తాగి మీ పక్కన ఉన్న వారి సైజులే తెగ బలిశాయి. ప్రజలను మాత్రం జలగ పట్టుకున్నట్లు పట్టుకుని రక్తాన్ని పీల్చేశారు. అందుకే ప్రజలు మిమ్మల్ని అంత ఘోరంగా తిరస్కరించారు’ అని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు ఏపీకి వచ్చిన స్విట్జర్లాండ్‌ మంత్రి చంద్రబాబు మాటలు విని, ఇలాంటి వారిని తమ దేశంలో అయితే పిచ్చాస్పత్రిలో చేరుస్తారని లేదా మరణ శిక్ష వేస్తారని చెప్పిన విషయాన్ని అంబటి ఈ సందర్భంగా గుర్తు చేశారు.  వైఎస్‌ జగన్‌ మంచి పాలన అందిస్తున్నపుడు మెచ్చుకోలేకపోయినా.. బురద జల్లే కార్యక్రమం చేస్తే మాత్రం ప్రజలు సహించరని రాంబాబు స్పష్టం చేశారు.

పోరాట యోధుడు సీఎం జగన్‌ 
వైఎస్సార్‌ మరణం తరువాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 2011 మార్చి 12వ తేదీన స్థాపించిన వైఎస్సార్‌సీపీ అనేక ఒడిదుడుకులకు లోనైందని, అయితే మొక్కవోని ధైర్యంతో ముందుకు నడిచి పారీ్టకి 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి పెట్టిన పోరాట యోధుడు వైఎస్‌ జగన్‌ అని అంబటి ప్రశంసించారు. 2014 ఎన్నికల్లో పార్టీకి 67 సీట్లు వస్తే వాటిలో 23 మంది ఎమ్మెల్యేలను, మరో ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి ప్రతిపక్షం గొంతు నులిమేయాలని చంద్రబాబు ప్రయత్నించినప్పటికీ ఒక పటిష్టమైన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ పోరాడిందని ఆయన పేర్కొన్నారు.  ప్రస్తుతం తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నెలకొల్పడం  ఎంతో సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.   

>
మరిన్ని వార్తలు