అప్పుడు దోచుకుని ఇప్పుడు డ్రామాలా!?

30 Nov, 2019 05:32 IST|Sakshi

అమరావతిలో ఇల్లెందుకు నిర్మించుకోలేదు?

కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.42 కోట్లా?

ఐదేళ్లలో ఒక్క శాశ్వత కట్టడం కూడా కట్టలేదు

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజం

అవినీతికి తావులేని ప్రజారాజధానిని మేం నిర్మిస్తాం

సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతి ప్రాంతాన్ని దోచుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ‘అమ్మో.. అమరావతి’ అంటూ గుండెలు బాదుకుంటూ డ్రామా ఆడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటు ఇక్కడ, ఇల్లు హైదరాబాద్‌లో కావాలా?.. ఇదేనా అమరావతిపై మీకున్న ప్రేమ చంద్రబాబు? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇక్కడ సొంత ఇల్లు కట్టుకోలేని ఆయనకు అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కులేదని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అంబటి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి తరువాత రాజధాని ప్రాంతంలో విషయం ఏమీలేకపోయినా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఛలో ఆత్మకూరు, ఇసుక దీక్ష, ఇంగ్లిషు మాధ్యమాల అంశాలు అయిపోయి, ఇప్పుడు బాబు అమరావతి వరకు వచ్చారని ఎద్దేవా చేశారు.

రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.42 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత రేటు వెచ్చించి ఉండరని అంబటి తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణానికి కిలోమీటరుకు గరిష్టంగా రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్లు మించి కాదని ఆయన చెప్పారు. అలాగే, భవనాలకు చదరపు అడుగుకు రూ.1,500 ఇస్తారని, మహా అయితే రూ.2 వేలు ఇస్తారని.. కానీ, బాబు రూ.6 వేలు నుంచి రూ.11 వేలు ఇచ్చారన్నారు. అమరావతిలో ఏముందని తాము చంపేశామని చంద్రబాబు అంటున్నారో తెలియడంలేదన్నారు. ఐదేళ్లలో ఒక్క శాశ్వత భవన నిర్మాణమూ కట్టలేదని గుర్తుచేశారు. కాగా, రాజధానిలో లోకేశ్‌ను తుక్కుతుక్కుగా ఓడించినా చంద్రబాబుకు జ్ఞానోదయం కలగలేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అమరావతి భూసమీకరణలో అందరినీ వేధించినందునే బాధితులు గురువారం చెప్పులు, రాళ్లు విసిరి తమ నిరసన తెలిపారన్నారు. కాగా, రాజధానిపై తాము స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అంబటి తెలిపారు. అవినీతికి తావులేకుండా ప్రజా రాజధాని నిర్మిస్తామన్నారు. 
 

మరిన్ని వార్తలు