ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా?

21 Jan, 2020 06:54 IST|Sakshi

చంద్రబాబుపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం 

దాడులు చేయాలని ప్రజల్ని రెచ్చగొడతావా? 

ఆస్తులు కాపాడుకోవడానికే బాబు కృత్రిమ ఉద్యమం  

అసలైన రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయదు 

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సొంత, బినామీల ఆస్తులను కాపాడుకోవడానికి కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని, ఆయనొక సంఘ విద్రోహ శక్తిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. నేను అసెంబ్లీ లోపల చూసుకుంటాను, మీరు బయట చూసుకోండి అంటూ ప్రజలకు పిలుపునివ్వడం ఏమిటని నిలదీశారు. దాడులు చేయాలని ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ‘నువ్వు ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహశక్తివా? పోరాటం పేరిట సంఘ విద్రోహ శక్తులను రెచ్చగొడుతున్నావు’ అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పోరాటం అమరావతి కోసం, రైతుల కోసం కాదని, కేవలం ఆయన బినామీల ఆస్తులను కాపాడుకోవడానికేనని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై అంబటి రాంబాబు మాట్లాడారు. 

రైతులకు తీరని ద్రోహం చేశారు 
‘‘ఉమ్మడి రాష్ట్రంలో అన్నింటినీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం చేశారు. తెలంగాణ నుంచి మెడపట్టి గెంటేసినా చంద్రబాబు దాన్నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. రాజధాని పేరిట ఆయన అనుయాయులు భారీ దోపిడీ సాగించారు. అమరావతి నిర్మాణం అంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. రైతులను మభ్యపెట్టి ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట వారి భూములు లాక్కున్నారు. ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టకుండా రైతులకు తీరని ద్రోహం చేశారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల భూములను అన్యాయంగా లాక్కున్నారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, ఆయన మనుషులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు’’ అని అంబటి నిప్పులు చెరిగారు.   

చంద్రబాబే తుగ్లక్‌  
‘‘సీఎం వైఎస్‌ జగన్‌ది తుగ్లక్‌ పాలన అని చంద్రబాబు అంటున్నారు. వాస్తవానికి పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నా సరే అక్కడి నుంచి రాత్రికి రాత్రే పారిపోయి విజయవాడ వచ్చిన చంద్రబాబు ఒక తుగ్లక్‌. హైదరాబాద్‌లోని భవనాల కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబే తుగ్లక్‌. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా నదికి ఆనుకొని నిర్మించిన భవనంలో నివాసం ఉంటున్న చంద్రబాబే తుగ్లక్‌. అందరి ప్రయోజనాల గురించి ఆలోచించే వ్యక్తే నాయకుడు అవుతాడు. చంద్రబాబు మాత్రం తాను, తనవాళ్లే బాగుండాలని తపించారు. సుజనా చౌదరి వంటి వారు రైతుల ముసుగులో ఉండి ధనార్జనకు తెగబడ్డారు. బినామీలను రైతులు అనరు. అసలైన రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్యాయం చేయదు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. చంద్రబాబును నమ్మితే నిండా మునిగినట్టే’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు