అసమర్థుడిని వారసుడిగా చేసేందుకే ఘోరాలు

29 Jan, 2020 06:32 IST|Sakshi

చంద్రబాబుపై అంబటి మండిపాటు  

తమ్ముడిని, తోడల్లుడిని వాడుకొని వదిలేసిన నీచుడు బాబు

సభకు రాకుండా బాబు పారిపోయారు 

బాబు ద్వంద్వ వైఖరి వీడియో సాక్షిగా బట్టబయలు

సాక్షి,అమరావతి: అసమర్థుడైన కుమారుడు లోకేశ్‌ను పార్టీకి వారసుడిని చేసేందుకు టీడీపీ నేత చంద్రబాబు అనేక ఘోరాలకు పాల్పడ్డాడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీని చేజిక్కించుకోవడం కోసం ఎన్టీఆర్‌ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన దుర్మార్గుడని, ఒక వైపు రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడుని, మరోవైపు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును వాడుకొని వదిలేసిన నీచ చరిత్ర బాబుదని మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులు దివంగత మహానేత వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. వైఎస్‌ విజయమ్మ తన ఇంట్లో జరిగిన వ్యవహారాన్ని మాజీ సీఎం రోశయ్యకు చెప్పిందని ఓ కట్టుకథ అల్లి అవాకులు చెవాకులు పేలడం బాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. అడ్డగోలు పత్రికలు, చానళ్లు ఉన్నాయని నోటికొచ్చినట్లు బాబు మాట్లాడుతున్నారన్నారు.  నీచ రాజకీయాలకు పేటెంట్‌ హక్కున్న బాబుకు దివంగత వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ల గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. చేసిన పాపాలు బాబును వెంటాడుతున్నాయని, ఎన్టీఆర్‌ కుటుంబం ఉసురు బాబుకు తాకినందువల్లే రోజురోజుకు పతనం దిశగా జారిపోతున్నాడన్నారు. 

బాబు చారిత్రక తప్పిదం  
సోమవారం జరిగిన శాసన మండలి రద్దు ఒక కీలకమైన తీర్మానమని పేర్కొన్నారు. 1983లో నాడు ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయమే తిరిగి నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా సభకు రాకుండా పారిపోయారని, ఇది చరిత్రాత్మకమైన తప్పిదమని అంబటి వ్యాఖ్యానించారు. బాబు ద్వంద్వ వైఖరిని సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో వీడియోల సాక్షిగా చూపించారన్నారు. చంద్రబాబు ఎలాంటి వాడో ప్రజలందరికీ అర్థం అయిందన్నారు. శాసనసభను రద్దు చేయాలని బాబు సవాల్‌ విసురుతున్నారని, ఆయనకు అంత ఉబలాటం ఉంటే 23 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాల్లో రాజీనామా 
చేయాలన్నారు.

మరిన్ని వార్తలు