‘ఎన్నికల వేళ కాపులంటే బాబుకు ప్రాణం’

1 Aug, 2018 16:24 IST|Sakshi
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: ఓట్లను దండుకోవడానికే 2014 ఎన్నికల్లో టీడీపీ కాపుల రిజర్వేషన్‌ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీనిచ్చి మాట తప్పిన చంద్రబాబు మోసగాడని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్లపై ఉద్యమం చేపట్టిన తర్వాతే చంద్రబాబు కమిషన్‌ వేశాడని గుర్తు చేశారు. రిజర్వేషన్లపై పోరాడుతున్న ముద్రగడకు వైఎస్సార్‌సీసీ మద్దతు ఇచ్చిందని అన్నారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్‌ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా తూతూ మంత్రంగా కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. మంజునాథ కమిషన్‌ రిపోర్టుని ప్రజల ముందుంచాలని అంబటి డిమాండ్‌ చేశారు. 

కాపుల అభివృద్ధికి అయిదేళ్లలో 5 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు కేవలం 1300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు మాట తప్పడం, వెన్నుపోటు పొడవడం కొత్తకాదని అన్నారు. బాబుకు కాపుల ఓట్లపై ప్రేమ ఉంది కానీ, వారి సంక్షేమంపై లేదని అన్నారు. ఇచ్చిన మాట తప్పాలని చూస్తున్న ముఖ్యమంత్రిని గద్దె దించేవరకు కాపులు నిద్రపోవద్దని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీసీ అధికారంలోకి వస్తే కాపుల సంక్షేమానికి 10 వేల కోట్ల కేటాయిస్తామని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్‌పై వైఎస్‌ జగన్‌ అన్న మాటల్ని టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

ఆదరణను చూసి తట్టుకోలేక పోతున్నారు..
అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సంక్షేమానికి 10వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కొట్టు సత్యనారాయణ అన్నారు. ప్రజల్లో జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్‌ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తేనే కాపులకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు