ప్రభుత్వంపై బురదజల్లేందుకే సమావేశాలు

6 Dec, 2019 04:50 IST|Sakshi

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపాటు

సాక్షి,అమరావతి: రాష్ట్ర ప్రజలను గ్రాఫిక్స్‌తో ఐదేళ్లు వంచించిన చంద్రబాబు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు పెట్టి రాజధానిపై అపోహలు సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. బాబు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రాజకీయ పక్షాలు పెద్దగా స్పందించినట్లు కన్పించలేదన్నారు. రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని, ఇతర పార్టీలను మాట మాత్రం అడగని చంద్రబాబు ఇప్పుడు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

బాబుకు అప్పుడు కన్పించని ప్రతిపక్షాలు ఓడిన తరువాత కన్పిస్తున్నాయా అని ఎద్దేవా చేశారు. రాజధానిపై అపోహలు సృష్టిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ... రాజధాని పేరు ఎత్తితే బాబు సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటారని, బాబుకు, ఆయన వర్గానికి మాత్రం రాజధాని బాగా సంపద సృష్టించిపెట్టిందన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన స్కాములు అన్నీఇన్నీ కావన్నారు. ఇవన్నీ కొత్తగా వచ్చిన తమ ప్రభుత్వం బయటపెట్టే ప్రయత్నంలో ఉందన్నారు.

దీంతో బాబుకు, ఆయన బినామీలు తమ దోపిడీ బయటపడుతుందనే భయంతో రాజధాని పర్యటనలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో ప్రజలు టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించినా జ్ఞానోదయం కాలేదన్నారు. రాష్ట్రంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఇక్కడి ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు పక్క రాష్ట్రాలకు ఆరోగ్య శ్రీ విస్తరించామన్నారు. ప్రజాప్రయోజనాల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవడానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్తున్నారే తప్ప మరే ప్రత్యేక అంశం లేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సార్థక నామధేయుడు పవన్‌ కల్యాణ్‌
పవన్‌ పదిరోజుల నుంచి మతం, కులం, ఉల్లిపాయలు గురించి ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. ఆయన సార్థకనామధేయుడని, పేరులోని రెండో భాగం కల్యాణంకు చాలా న్యాయం చేశాడని వ్యాఖ్యానించారు. బాప్టిస్టు మతం తీసుకున్నానని పేర్కొన్న పవన్‌ తిరుమల వెళ్లినపుడు డిక్లరేషన్‌ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని అంబటి డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా