పవన్‌కు కౌంటర్‌ ఇచ్చిన అంబటి

24 Oct, 2019 14:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ అంశాలను వివరించేందుకే కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిశారని పేర్కొన్నారు.  రాష్ట్ర సమస్యలను ఒక ముఖ్యమంత్రిగా  కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం జగన్‌ బాధ్యత అని అంబటి పేర్కొన్నారు. ఈ విషయం మరిచిపోయిన పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుతో కుమ్మక్కై బరితెగించి సీఎంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

జగన్‌పై కేసులు విచారణ జరుగుతుండగానే నేరస్తుడు అంటూ ఎలా అంటారని, వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకొనే పవన్‌ కల్యాణ్‌కు ఈ సంగతి తెలియదా అంటూ అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పెట్టుకొని సీబీఐతో అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూశారన్నారు. అంతటితో ఆగకుండా అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టినా వైఎస్‌ జగన్‌ ఎవరికి భయపడలేదని గుర్తుచేశారు. మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి మద్దతుగా పవన్‌ జనసేన పార్టీనీ స్థాపించారని దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లాలో వలసల గురించి ప్రశ్నించే ముందు తన పార్టీలో జరుగుతున్న వలసలను ఆపుకోవాలని వ్యాఖ్యలు చేశారు. రెండోచోట్ల పవన్‌ పోటీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారో తెలుసుకోవాలన్నారు. ఆయన ఓడిపోయిన చోట ఇప్పటివరకూ మొహం చూపించలేదన్నారు. 

ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయిన పవన్‌కు వైఎస్‌ జగన్‌ నైతికత గురించి మాట్లాడే హక్కుందా అంటూ అంబటి సూటిగా ప్రశ్నించారు.  చంద్రబాబుతో లాలూచీ రాజకీయాలు చేసిన పవన్‌... కుప్పం, మంగళగిరిలో చంద్రబాబు, లోకేశ్‌పై ఎందుకు పోటీ పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు. పవన్‌ ఇప్పటికైనా చంద్రబాబు లాంటి వ్యక్తులను నమ్ముకొని రాజకీయాలు చేస్తే ప్రజలు తిరస్కరిస్తారన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చెప్పుడు మాటలు వినకుండా సొంతంగా పార్టీ నడిపిస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం నాలుగు సీట్లయినా సంపాదించుకోగలుగుతారని సూచించారు. చంద్రబాబు డీఎన్‌ఏ, పవన్‌ డీఎన్‌ఏ ఒకటి కాబట్టే  పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అంబటి అన్నారు.

మరిన్ని వార్తలు