బాబువల్లే కోడెలకు క్షోభ

18 Sep, 2019 04:47 IST|Sakshi

కోడెల ఆత్మహత్యకు కుటుంబీకులు, టీడీపీయే కారణం

ఎమ్మెల్యే అంబటి ధ్వజం

సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆయన కుటుంబీకులు, టీడీపీ నేతలు, చంద్రబాబేనని సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచమైన ఎత్తుగడలతో శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కోడెలను చంద్రబాబు పదే పదే అవమానించారని, టీడీపీ నేత వర్ల రామయ్యతో ఆరోపణలు చేయించారని చెప్పారు.

ఎన్నిసార్లు ప్రయత్నించినా చంద్రబాబును కలుసుకోవడానికి అవకాశమే ఇవ్వలేదన్నారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేయబోతున్నారని ప్రచారం కూడా చేయించారని విమర్శించారు. కోడెల ఆత్మహత్యకు కారణం కేసులు కానే కాదని, చంద్రబాబు తీరుతోనే మానసిక క్షోభకు గురయ్యారని తెలిపారు. శివప్రసాదరావు తమకు రాజకీయ ప్రత్యర్థే తప్ప వ్యక్తిగత ప్రత్యర్థి ఎంత మాత్రం కాదని, ఆయన చనిపోవాలని కోరుకునే మనస్తత్వం తమది కాదని అంబటి స్పష్టం చేశారు. 

పరామర్శించని చంద్రబాబు 
ఆగస్టు 23వ తేదీనే కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఆయన అల్లుడు లక్ష్మీ సూపర్‌ స్పెషాలిటీస్‌ ఆస్పత్రిలో చేర్పించారని అంబటి తెలిపారు. అయితే దానిని బయటకు రానీయకుండా ఆయన బంధువులు, కుటుంబీకులు గుండె పోటు అని మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించారన్నారు. అప్పట్లో ఆస్పత్రికి అనేక మంది టీడీపీ వారు వెళ్లి పరామర్శించారని, అక్కడకు కేవలం 50 మీటర్ల దూరంలో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి నాలుగు సార్లు వచ్చి వెళ్లిన చంద్రబాబు.. కనీసం పరామర్శ చేయలేదని అంబటి దుయ్యబట్టారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మరో మాజీ మంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్లి ‘మీరొకసారి పరామర్శించండి’ అని చంద్రబాబుకు సలహా ఇస్తే ‘నేను రాను’ అని తెగేసి చెప్పారన్నారు. కోడెలపై ఇటీవల వచ్చిన 19 కేసుల్లో ఎక్కువగా టీడీపీ వారు పెట్టినవేనని అంబటి తెలిపారు. 

మరిన్ని వార్తలు