‘చంద్రబాబు పతనానికి ఈ ఓటమి నాంది’

11 Dec, 2018 15:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహాకూటమి పరాజయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటమి.. ఆయన పతనానికి తెలంగాణ ఎన్నికల్లో ఓటమి నాంది పలికిందని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, టీడీపీ కలయికను అసహ్యకరమైన కూటమిగా ప్రజలు భావించారన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి కొంత వ్యతిరేకత ఉంటుందన్నారు. 2014లో 63 స్థానాలు సాధించిన టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో అంతకంటే అధికంగా స్ధానాలు సాధించేలా కనిపిస్తోందన్నారు. చంద్రబాబునాయుడు ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలు హర్ట్ అయ్యారని తెలిపారు. ‘కేసీఆర్ హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఆయనను ఓడించండి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారని, ప్రజలకు 600 హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చని చంద్రబాబు వచ్చి ఇలా మాట్లాడటాన్ని సహించలేక ప్రజలు మహాకూటమిని తిరస్కరించారని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిలా చంద్రబాబు వ్యవహరించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి సొమ్మును తెలంగాణలో పంచిపెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఓటుకునోటు కేసులో డబ్బులు పంచుతూ దొరికిపోయారని అన్నారు. హైద్రాబాద్‌కు, సైబరాబాద్‌కు నేనే సృష్టికర్తను అని గప్పాలు కొట్టిన చంద్రబాబుకు ఈ తీర్పు ద్వారా ఆ మాటలను ప్రజలు గట్టిగా తిరస్కరించారని చెప్పారు. లగడపాటి ద్వారా మహాకుట్ర జరిగిందని ఆరోపించారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ లగడపాటి రాజకీయసన్యాసం చేశానని గతంలో ప్రకటించారు. కానీ ఈ ఎన్నికలలో సెఫాలజిస్ట్ అవతారం ఎత్తారు. చంద్రబాబు స్పీకర్ ,కలెక్టర్ వ్యవస్థలతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తారు. లగడపాటి అప్పులపాలై అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితులలో ఆయనను ఆర్థికంగా ఆదుకునే క్రమంలో భాగంగా సర్వే పేరుతో కుట్ర చేశారు.

ఈ సర్వే ద్వారా ఒకటో రెండో శాతం ఓట్లను ప్రభావితం చేయాలని ప్రయత్నించారు. చంద్రబాబు.. లగడపాటిని సరిగ్గా ఎన్నికల ముందు ప్రవేశపెట్టారు. మహాకూటమి గెలవబోతుందని చెప్పించారు. వేయి మర్డర్స్ కన్నా ఘోరమైన తప్పిదం లగడపాటి చేశాడు. చంద్రబాబు అనుకూల పత్రికలు కూడా లగడపాటిని వీరుడు, శూరుడు అని బాగా హైలెట్ చేశాయి. ఏదో ఒక విధంగా తెలంగాణా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి లగడపాటి ప్రయత్నించారు. అభాసుపాలయ్యాడు. గతంలో పోలింగ్ అయ్యాక మాత్రమే లగడపాటి సర్వే ప్రకటించేవారు. ఇల్లీగల్‌గా బెట్టింగ్స్ కట్టించాడనే భావన కలుగుతా ఉంది. కొన్ని వందల, వేల కోట్ల రూపాయలు టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున కట్టించాడని పుకార్లు నడుస్తున్నాయి. వాస్తవం నాకు కూడా తెలియదు.

ఈసారి కూడా లగడపాటికి వాస్తవం తెలిసినా కుట్రలో భాగస్వామ్యమయ్యారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసే ప్రయత్నం లగడపాటి, చంద్రబాబులు చేశారు. దీనిపై విచారణ జరగాలి. వాస్తవాలను నిగ్గుతేల్చాలి. ప్రభుత్వాల్ని మార్చాలనే వీరి కుట్ర బహిర్గతం కావాలి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విచారణ చేసి వాస్తవాలను బయటకు తీసుకురావాలి. ప్రజల మనోభావాలను ఎవ్వరూ కూడా మార్చలేరు. చంద్రబాబు ఎన్ని కోట్లు తీసుకువచ్చి ప్రలోభాలకు గురిచేసినా కూడా తెలుగు ప్రజలు వారి ఆకాంక్షలకు అనుగుణంగా కుట్ర, డబ్బుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా, సేవ్ ఇన్‌స్టిట్యూషన్స్ అని ఢిల్లీ వెళ్లి చంద్రబాబు చెబుతున్నాడు. కానీ అన్ని వ్యవస్థలను నాశనం చేసింది చంద్రబాబే.

మనం శకుని పాత్రను చూశాం. ల్యాంకో అధినేత లగడపాటి రాజగోపాల్ కూడా అదే పాత్ర నేడు పోషించారు. ప్రజాస్వామ్యంలో నీచమైన దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులను ఉపేక్షించకూడదు. ఇలాంటి వ్యక్తులు ఇతర దేశాలకు పారిపోయేప్రమాదం ఉంది. మహాకూటమి నేతలు అంతా కలసి అధికారం వచ్చేస్తుందనే భావనతో గవర్నర్ గారిని కలసి మమ్మల్ని ఒకటిగానే భావించండి అని కోరారు. ప్రజలు మిమ్మల్ని కట్టకట్టి ఒకటిగా భావించి ఓడించారు. అనైతిక పొత్తులను ప్రజలు వ్యతిరేకించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. చంద్రబాబు తెలంగాణాలో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి మరిన్ని స్థానాలు వచ్చి ఉండేవ’’ని అన్నారు.

మరిన్ని వార్తలు