బెదిరించ లేదు, ఇది వాస్తవం: అంబటి

15 Mar, 2020 18:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : ‘‘ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవంగా విజయం సాధిస్తోంది. మేం ఎవరినీ బెదిరించ లేదు, ఇది వాస్తవం’అని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ‘కరోనా వైరస్‌ వల్ల కాదు.. క్యాస్ట్ వైరస్ వల్లే ఎన్నికలు వాయిదాపడ్డాయి’ అంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కరోనా వైరస్ సాకుగా చేసుకుని ఎన్నికలు నిలుపుదల చేశారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఏవిధమైన చర్చలు, సంప్రదింపులు లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆరు వారాలపాటు ఎన్నికలు నిలుపుదల చేశారు. రాష్ట్రంలో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. కరోనా వైరస్ ఉన్నంతవరకు ఎన్నికలు జరగవని, ఎలక్షన్ కమిషన్ సంకేతాలు పంపినట్లుంది. చంద్రబాబు తన హయాంలో సొంత మనుషులను ఏర్పాటు చేశారు.  రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు బాబు యత్నిస్తున్నారు. ( ‘ఆ ఇద్దరు వ్యవస్థను భ్రష్టు పట్టించారు’ )

చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నియమితులయ్యారు. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ఆశించినంత ఫలితాలు రావడం లేదు. టీడీపీ నిర్వీర్యం అవుతున్న పరిస్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అంతరించి పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను రహస్యంగా డాక్యుమెంట్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌ సీపీదే విజయం. మార్చి 31లోగా స్థానిక ఎన్నికలు జరగకుంటే.. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన రూ.5800 కోట్ల నిధులు రావు. ఈ అంశంపై ఎలక్షన్ కమిషనర్ ప్రజలకు జవాబు చెప్పాలి. చంద్రబాబు కోసం రమేష్‌కుమార్ కుట్రపూరితంగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసేముందు ఎవరినైనా సంప్రదించారా?. (చంద్రబాబు కనుసన్నల్లో రమేష్‌ కుమార్‌..

ఇది 6 వారాల్లో పోయే సమస్య కాదు. దీనికి కొనసాగింపు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. ఎన్నికలులేకున్నా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందట. ఎన్నికలు జరిగేంతవరకు అధికారం ఈసీ చేతుల్లోనే ఉంటుందా?. రమేష్‌కుమార్ వెనుక చంద్రబాబు ఉండి పాలన సాగిస్తారా?. రెండు నెలలపాటు అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి. ఇది సరైన విధానం కాదు. ఈసీ ఎక్కడ నివేదిక తెప్పించుకున్నారు. కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి ఏ అధికారులను సంప్రదించారని అడుగుతున్నాం. ఎన్నికల ప్రక్రియను అర్థాంతరంగా నిలిపివేయడం సబబా?.  కరోనా వ్యాధి ఉన్నంత వరకు ఎన్నికలు జరగవా?. ఎన్నికలు వాయిదా వేయడం అభివృద్ధికి అడ్డంకి అని భావిస్తున్నాం. ఈసీ కుట్ర పూరితంగా వ్యవహరించిందని మేం ఆరోపిస్తున్నా’మని అన్నారు.

మరిన్ని వార్తలు