రాజకీయ కోణం బట్టబయలైంది: అంబటి

18 Mar, 2020 18:24 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయడంలో ఎలక్షన్‌ కమిషన్‌ తన పరిధిని దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు  చాలా స్పష్టంగా  తీర్పు చెప్పిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..  కరోనా సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని, దీంతో ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. ఎన్నికల వాయిదా రాజకీయ కోణంలో జరిగినట్లు బట్టబయలయిందన్నారు. ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్ ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది అతిక్రమణ, తప్పు అని ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ ఎత్తి వేయాలని, సంక్షేమ పథకాల కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం మంచి పరిణామమని అంబటి రాంబాబు అన్నారు. (అందుకే టీడీపీని వీడాను: శమంతకమణి)

ఎన్నికలు నిర్వహించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని, సుప్రీంకోర్టు స్పష్టంగా తన తీర్పులో చెప్పిందని అంబటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే  చారిత్రాత్మక తీర్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కుట్ర పూరితంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని అంబటి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కొన్ని రోజుల పాటు స్తంభింప చేయాలనే కుట్ర చేశారని ఆయన ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ప్రశ్నలపై ఈసీ సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్‌ చేశారు. సాధ్యమైనంత తొందరగా ఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్షన్ కమిషన్‌ ఇప్పటికైనా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనక చంద్రబాబు ఉన్నారని అంబటి మండిపడ్డారు.(‘సుప్రీంకోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టు’)

కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారని, అదేవిధంగా ఎస్‌ఈసీలో కూడా ముగ్గురు సభ్యులు ఉండేలా సంస్కరణలు తేవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి నుంచి పెట్టాలని అడుగుతున్న చంద్రబాబు, అసెంబ్లీ ఎన్నికలు కూడా పెట్టమని అడుగుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గొంతెమ్మ కోరికలు ఎన్నైనా కోరుతారని, బాబు అడిగేవన్ని జరగవని అంబటి అన్నారు. చట్టం, నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అంబటి రాంబాబు తెలిపారు. (ఎన్నికలంటే విపక్షాలకు భయమెందుకు)

>
మరిన్ని వార్తలు