బాబు ఎక్స్‌ప్రెషన్‌ చూశారా! లోకేశ్‌కు విషయం ఉందా?

17 Jun, 2018 18:56 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల గురించి మాట్లాడి మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తన అపర పరిజ్ఞానాన్ని చాటుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అభివృద్ధి నిధుల గురించి చినబాబు ప్రచారం చేస్తున్న విషయాలు, క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరువేరుగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘నారా లోకేశ్‌ విషయం ఉన్న వ్యక్తికాదు. ప్రత్యేక అభివృద్ధి నిధులను నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు మాత్రమే ఇవ్వాలి. కానీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల పరిస్థితి మరోలా ఉంది. ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆ నిధులు ఇస్తున్నారు. దీనిపై ఆగ్రహించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు.. ఈ రాజ్యాంగవిరుద్ధచర్యపై  గతంలోనే ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. అయినాసరే, ఆయన స్పందిచలేదు. పాపం మంత్రి నారా లోకేశ్‌కు ఈ విషయం తెలియకపోవడం శోచనీయం. తనకు పరిజ్ఞానం లేదని ఆయనే మరోసారి రుజువుచేసుకున్నారు

చంద్రబాబు ముఖంలో ఆ ఎక్స్‌ప్రెషన్‌ గమనించారా?: చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు భూకంపం సృష్టిస్తారని, దేశాన్ని గడగడలాడిస్తాడని, ప్రధాని మోదీని గట్టిగా నిలదీస్తారని.. ఆయన అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. తీరా చూస్తే మోదీకి చంద్రబాబు వంగివంగి దండాలు పెట్టాడు! కేంద్రంపై పోరాటమంటే ఇదేనా? మోదీని కలిసినప్పుడు చంద్రబాబు ముఖంలో ఆ ఎక్స్‌ప్రెషన్‌ గమనించారా.. భయాన్ని కవర్‌ చేసుకుంటూ ఓ వికృత నవ్వు రువ్వడం!! నాటకాల ఆడటంలో తనను మించినవారే లేరని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. అంతేనా, ఐదుకోట్ల ఆంధ్రులను మరోసారి దారుణంగా మోసం చేశారు. అతను పోరాటాలు చేసే రకం కాదు.. అందితే కాళ్ళు, లేకుంటే జుట్టు పట్టుకునే టైపని ప్రజలకు ఎరుకే. నీతి ఆయోగ్‌ సమావేశం వేదికగా బీజేపీ-టీడీపీల లాలూచీ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి.

ఆ సర్వేల సంగతి ప్రజలే తేలుస్తారు: వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ప్రజలంతా కలిసొస్తున్న తీరును చూసి చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైంది. అందుకే సర్వేల పేరుతో చీప్‌ మైండ్‌గేమ్‌ను తెరపైకి తెచ్చాడు. ఇలాంటి మైండ్‌గేమ్‌లను ప్రజలు పట్టించుకోరు. గందరగోళం సృష్టించాలని చూస్తే ఆ సర్వేల సంగతిని ప్రజలే తేలుస్తారు. నూటికి నూరుశాతం జనం చంద్రబాబు పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవం. మళ్లీ అధికారంలోకి రాలేనని తెలుసుకాబట్టే చంద్రబాబు ఇలా సర్వేలతో సంతోషపడుతున్నాడంతే’’ అని అంబటి రాంబాబు అన్నారు.

మరిన్ని వార్తలు