‘మీ ప్రభుత్వంపై మీరే కోర్టుకా.. సిగ్గు చేటు’

20 Jan, 2018 01:11 IST|Sakshi

     నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడి మాటల్లో చంద్రబాబు నాటకాలు తేటతెల్లం

     అంబటి రాంబాబు ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లేని జీడీపీని, లేని తలసరి ఆదాయాన్ని ఉన్నట్లుగా అంకెల గారడీ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నందుకే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా రావడం లేదని, విభజన హామీలు అమలు కాకపోవడానికి కూడా ఆయనే అడ్డంకి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ) సభ్యుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదైతే... ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఇప్పటివరకూ ఎలాంటి ప్రయత్నం చేయలేదని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ మాటల ద్వారానే తేటతెల్లం అయిందన్నారు. అంబటి శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా అనేది రాష్ట్రం హక్కు అని, దాన్ని తీసుకు రావాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని అంబటి చెప్పారు. ఇదే విషయాన్ని ప్రతిపక్షం, ప్రజలు బాబును పలు సందర్భాల్లో నిలదీశారన్నారు. విభజన చట్టంలోని అంశాలను చంద్రబాబు, మోదీ ఇద్దరూ కలిసి నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. విభజన చట్టం 2014లో ఆమోదం పొందగా... అందులోని అంశాలను కేంద్రం నెరవేర్చకపోతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చంద్రబాబు ఇవాళ విచిత్రమైన వ్యాఖ్య చేయడం విడ్డూరంగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి సాధించలేక న్యాయస్థానానికి వెళ్తామని చెప్పడం ఆయన వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. అందరమూ కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు