‘వారితో విభేదాలు వద్దని చంద్రబాబుకి ఎప్పుడో చెప్పా’

24 Jun, 2019 20:14 IST|Sakshi

బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రకటించిన అంబిక కృష్ణ

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌, థియేటర్‌, టెలివిజన్‌ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌గా కొనసాగుతున్న టీడీపీ సీనియర్‌ అంబికా కృష్ణ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దేశానికి దిశానిర్దేశం చేసేది బీజేపీ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. గతకొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న ఆయన.. బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై స్పందించిన అంబికా కృష్ణ తాను బీజేపీలో చేరుతున్నట్ల ప్రకటించారు. ఏపీలో బీజేపీలో చేరేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో విభేదాలు, పోరాటాలు వద్దని చంద్రబాబు నాయుడికి చాలా సార్లు చెప్పాని, ఆ తప్పిదాల కారణంగానే పార్టీ తీవ్రంగా దెబ్బ తిన్నదని అన్నారు. 

చంద్రబాబు బీజేపీ మీద చేసిన పోరాటాలు తనకు నచ్చలేదన్నారు. ‘‘నేను టీడీపీలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పదవులు అనుభవించలేదు. నేను టీడీపీకి నమ్మక ద్రోహం చేయలేదు. టీడీపీనే నాకు నమ్మక ద్రోహం చేసింది.  20  ఏళ్లు నుంచి టీడీపీలో ఉన్నాను. పార్టీ ఓడిపోయిందని బీజేపీలో చేరట్లేదు.  టీడీపీలో గల్ఫ్ ఏర్పడింది. కేంద్రంతో సఖ్యత లేకపోతే నిధులు రావని ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు’’ అని అన్నారు. ఆయన పార్టీ మార్పుతో పశ్చిమ గోదావరి టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇటీవల గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా..  ఆయన సోదరుడు అంబికా రాజా కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 


 

మరిన్ని వార్తలు