అంబటి అరెస్ట్‌.. సత్తెనపల్లిలో ఉద్రిక్తత

8 Jan, 2018 13:10 IST|Sakshi

సాక్షి, గుంటూరు/సత్తెనపల్లి : అర్హులందరికీ పెన్షన్లు అందించడంలో విఫలం చెందారు కాబట్టే టీడీపీ నేతలు చర్చకు భయపడుతున్నారని, అందులో భాగంగానే తనను హౌస్‌ అరెస్టు చేశారని వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. పెన్షల వ్యవహారంపై ఓ టీవీ చానెల్‌లో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విసిరిన సవాలును స్వీకరిస్తూ సత్తెనపల్లి సెంటర్‌లో చర్చ కోసం బయలుదేరిన అంబటిని గుంటూరులోనే పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

సత్తెనపల్లిలో ఉద్రిక్తత : టీడీపీ నాయకులతో చర్చ కోసం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొందరు సత్తెనపల్లికి చేరుకున్నారు. అంతలోనే అంబటి అరెస్టు వార్త తెలియడంతో కార్యకర్తలు ఆందోళకు గురయ్యారు. అక్కడికక్కడే శాంతియుత నిరసనలకు సిద్ధమయ్యారు. కానీ పోలీసులు వారిని బలవంతంగా పంపేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం అదే ప్రదేశంలో.. పోలీసుల అండతో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, ఎమ్మెల్సీ వెంకన్నలు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. సమస్యలపై మాట్లాడాలనుకున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి, అధికార పార్టీ నేతలకు వత్తాసుపలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమని అంబటి రాంబాబు విమర్శించారు. చర్చ చేపడితే అక్రమాలు బయటికొస్తాయనే భయంతోనే టీడీపీ నేతలు పోలీసులను అడ్డంపెట్టుకుని కుట్రలు చేశారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు