అస్సాంతో అశాంతి పరిస్థితులు తప్పవా!

3 Aug, 2018 15:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యులు గురువారం నాడు అస్సాంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, వారిని సిల్చార్‌ విమానాశ్రయంలో అస్సాం పోలీసులు అడ్డగించడం తెల్సిందే. ఇటీవల కోల్‌కతాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీకి మమతా బెనర్జీ అనుమతివ్వకపోవడంతో ఆయన తనను అరెస్ట్‌ చేసుకోమని సవాల్‌ చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉందని, అటు బెంగాల్‌లో పాగా వేసేందుకు అటు బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఆ ప్రయత్నాలను అడ్డుగోవడంతోపాటు రానున్న ఎన్నికల నాటికి ఇటు అస్సాంలో బీజేపీని బలహీనం చేయడం మమతా బెనర్జీ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది నిజమే కావొచ్చుకానీ ఇది ఇంతకన్నా చాలా లోతుగా పరిశీలించాల్సిన అంశం.

ఎన్‌ఆర్‌సీ విడుదల చేసిన జాతీయ పౌరసత్వ జాబితాలో దాదాపు 40 లక్షల మంది ప్రజలకు చోటు లభించకపోవడాన్ని మమతా బెనర్జీ మతపరమైన అంశంగా కాకుండా జాతిపరమైన అంశంగానే చూస్తున్నారు. ఇదో మరో ‘బెంగాలీ ఖెదావో (బెంగాలీలను బహిష్కరించండి)’ ఆందోళనేనని ఆమె ఆరోపిస్తున్నారు. ఆమె మాటల్లో నిజం లేకపోలేదు. 1960, 1970 దశకాల్లో అస్సాం సాంస్కృతిక జాతీయవాదులు ‘బొంగాల్‌ ఖేదా’ పేరిట వేలాది మంది బెంగాళీలను అస్సాం నుంచి తరిమేశారు. ఆ తర్వాత 1979 ప్రాంతంలో బెంగాళీల పేరిట బంగ్లాదేశ్‌ వలసదారులకు అప్పటి ప్రభుత్వం ఓటు హక్కు కల్పించినందుకు అస్సాం మరోసారి భగ్గుమంది. అస్సాం జాతీయ వాదులు 1979 నుంచి 1985 వరకు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన నుంచి తీవ్రవాదులు పుట్టుక రావడంతో రాష్ట్రంలో విధ్వంసకాండ కూడా పెద్ద ఎత్తునే చెలరేగింది.

ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగానే లక్షలాది మంది ప్రజలు అస్సాం రాష్ట్రానికి వలసపోయారు. వారిలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు.  ‘బెంగాలీలను బహిష్కరించండి’ అన్న అస్సామీల ఆందోళన కారణంగా వేలాది మంది వెనక్కి వచ్చారు. వారికే బెంగాలీ ప్రభుత్వం సరైన ఆశ్రయం కల్పించలేక పోయింది. ఇప్పుడు ఏకంగా 40 లక్షల మందిని అస్సాం ప్రభుత్వ తరిమేస్తే వారిలో ఎక్కువ మంది బెంగాల్‌నే ఆశ్రయిస్తారన్నది మమతా బెనర్జీ భయం. దాన్ని ఎలాగైనా అడ్డుకోవడంతోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇదే అంశంపై వీలైనంత వరకు ఇరుకునబెట్టి రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలన్నది కూడా ఆమె వ్యూహమే. మరోపక్క ముస్లింలను బహిష్కరించడం ద్వారా దేశవ్యాప్తంగా హిందూశక్తులను ఆకర్షించి రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందాలన్నది బీజేపీ వ్యూహం. ఎవరి వ్యూహం ఏమైనప్పటికీ బెడిసికొడితే అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడి దేశంలో అశాంతి నెలకొంటుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు