అమిత్‌ షా పర్యటన.. తీవ్ర ఉద్రిక్తత

4 Feb, 2019 16:13 IST|Sakshi

సాక్షి, పలాస(శ్రీకాకుళం): బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం పలాస పర్యటన తీవ్ర ఉద్రిక్తత, నిరసనల మధ్య కొనసాగుతోంది. అమిత్‌ షా పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు రోడ్లపై భైఠాయించి నిరసనలు తెలిపారు.  దీంతో ఎమ్మెల్యేతో పాటు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి.. స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో తమ నేతల అరెస్టులకు నిరసనగా టీడీపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ‘గో బ్యాక్‌ అమిత్‌ షా’ అంటూ నినాదాలు చేశారు.  షా పర్యటనను అడ్డుకోవాలనుకోవడం  ప్రజాస్వామ్మ విరుద్దమని, అధికారం ఉంది కదా అని టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగటంపై ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బీజేపీ బస్సు యాత్ర
కేంద్రం అమలు చేస్తున్న 126 సంక్షేమ పథకాలపై దేశవ్యాప్త ప్రచారంతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా నిర్వహించే బస్సు యాత్ర ఫిబ్రవరి 4 (సోమవారం)న శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభిస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందజేస్తోన్న సాయంతోపాటు టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో బస్సు యాత్రను చేపట్టినట్టు బీజేపీ పేర్కొంది. 

>
మరిన్ని వార్తలు