నేడు, రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల భేటీ

13 Jun, 2019 04:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల సమావేశం ఈ నెల 13, 14 తేదీల్లో ఢిల్లీలో జరగనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అధ్యక్షతన ఢిల్లీలో ఈ సమావేశాలు జరుగనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ విస్తరణ, ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే విషయంపై చర్చించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అమిత్‌షా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో పార్టీ బలోపేతంపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు.

బీజేపీ బలోపేతానికి అవకాశం ఉన్న ప్రాంతం తెలంగాణ అని, అందుకే జాతీయ పార్టీ, అమిత్‌షా ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీ ఓటు బ్యాంకు పెంపు వంటి అంశాలపై జాతీయ పార్టీకి నివేదిక అందిస్తానని తెలిపారు. మరోవైపు అమిత్‌షా కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమితులైన నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవిని జేపీ నడ్డాకు అప్పగిస్తారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడి నియామకంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తెలంగాణలోనూ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మూడేళ్ల పదవీ కాలం ఇప్పటికే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి నియామకంపై ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాల్లో దీనిపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చన్న భావనను బీజేపీ వర్గాలు వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు