సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌పై కేసు లేదా!

4 May, 2019 17:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘2014 ఎన్నికల నాటికి సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌పై ఓ కేసుకు సంబంధించి కుట్ర అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని రెండు కోర్టులు కొట్టివేశాయి’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, రిపిబ్లిక్‌ టీవీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్నాబ్‌ గోస్వామికి ఏప్రిల్‌ 25వ తేదీన ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అదేరోజు ఆ విషయాన్ని బీజేపీ అధికార ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు కూడా. అది అబద్ధం. 2008, సెప్టెంబర్‌ 29వ తేదీన మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించడం, దాదాపు వంద మంది గాయపడడం తెల్సిందే.

ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం కింద నమోదు చేసిన అభియోగాలను ఎన్‌ఐఏ కోర్టు 2017, డిసెంబర్‌ 27వ తేదీన కొట్టి వేసింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కింద దాఖలు చేసిన అభియోగాలను కొట్టి వేయలేదు. పైగా ‘ఇండియన్‌ పీనల్‌ కోడ్‌కు సంబంధించి మాలేగావ్‌ బాంబు పేలుళ్లకు కుట్రపన్నారనడానికి ప్రజ్ఞాసింగ్, ఇతర నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నేను ఇదివరకే చెప్పాను’ అని ఎన్‌ఐఏ కోర్టు ప్రత్యేక జడ్జీ వీఎస్‌ పడాల్కర్‌ వ్యాఖ్యానించారు.

అంతేకాదు హత్య, నేరపూరిత కుట్ర, రెండు మతాల మధ్య వైషమ్యాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ, ప్రజల ఆస్తికి నష్టం కలిగించడం తదితర అభియోగాలపై సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌తోపాటు మరో ఆరుగురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని 302, 307, 326, 324, 427,153ఏ, 120 బీ సెక్షన్ల కింద, 1908 నాటి పేలుడు పదార్థాల చట్టంలోని 3,4,5,6 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు 2018, అక్టోబర్‌ 30 నాడు ఎన్‌ఐఏ కోర్టు తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం వీటిపై విచారణ కొనసాగుతోంది.

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నివారణ కోసం మూడుసార్లు ఆపరేషన్‌ చేయించుకున్న ప్రజ్ఞాసింగ్‌ అనారోగ్య కారణాలపై ఎప్పుడో బెయిల్‌ తీసుకున్నారు. ఈ కోర్టుతోపాటు సుప్రీం కోర్టు కూడా ఆమెపై అభియోగాలను కొట్టివేసిందని అమిత్‌ షా ప్రకటించారు. సుప్రీం కోర్టు కూడా మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల కింద అభియోగాలు మోపడం సబబేనా అంటూ సందేహం వ్యక్తం చేసిందీ తప్ప కేసును కొట్టివేయలేదు. తీవ్రమైన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎలా టిక్కెట్‌ ఇచ్చారని ఓటర్లు భావించే అవకాశం ఉందన్న కారణంగా అమిత్‌ షా తప్పుడు ప్రచారాన్ని అందుకొని ఉండవచ్చు. భోపాల్‌ నుంచి ప్రజ్ఞాసింగ్‌ పోటీ చేస్తున్నట్లు ఏప్రిల్‌ 20వ తేదీన బీజేపీ ప్రకటించిన విషయం తెల్సిందే. అంతకు మూడు రోజుల ముందే ఆమెను బీజేపీ లాంఛనంగా పార్టీలో చేర్చుకుంది.

మరిన్ని వార్తలు