ఆ ఇమేజ్‌ పోవడం సంతోషం: అమిత్‌ షా

19 Dec, 2019 10:55 IST|Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో తాము వైఫల్యం చెందలేదని.. తమకు 105 సీట్లు వచ్చాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- శివసేన కూటమికి మెజారిటీ దక్కినప్పటికీ శివసేన పట్టుదల కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయామని పేర్కొన్నారు. ఆజ్‌తక్‌ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ షా.. విలేకరి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ... శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పెట్టుకున్న ఆశల కారణంగానే తాము అక్కడ అధికారానికి దూరమయ్యామని తెలిపారు. ‘మా మిత్రపక్షం కాంగ్రెస్‌ పార్టీ, ఎన్సీపీలతో పారిపోయింది అందుకే..బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు’ అని పేర్కొన్నారు.

ఇక మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో అభినవ చాణక్య బిరుదు అనే పోయినందుకు బాధపడుతున్నారా అని విలేకరి ప్రశ్నించగా... ‘నిజానికి అలాంటి ఇమేజ్‌ పోవడం చాలా మంచి విషయం. సంతోషంగా ఉంది. ఆరోజు శివసేనతో కలిసి మేము గవర్నర్‌ దగ్గరికి వెళ్లాల్సిన సమయంలో పరిస్థితులు తారుమారయ్యాయి. బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారని.. ఎన్నికలకు వెళ్లే ముందే వాళ్లకు కచ్చితగా చెప్పాం. అయితే ప్రధాని మోదీ చరిష్మా కారణంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మార్చారు. ఈ పరిణామాలు నన్ను విసిగించలేదు. కానీ మంచి గుణపాఠం నేర్పాయి’అని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు బీజేపీతో జట్టుకట్టిన శివసేన.. అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా